February 6, 2013

నేనున్నా.. ఎదురు తిరగండి


పాదయాత్రతో తాడేపల్లి వచ్చిన చంద్రబాబుకు కేఎల్ రావు కాలనీ, మార్కెట్ సెం టరు, రన్నింగ్ రూమ్, ముగ్గురోడ్డు, నులకపేట, ప్రకాష్‌నగర్ ప్రాంత వాసులు తమ సమస్యలు వివరించారు. తాడేపల్లిలో అధికంగా రైల్వే సమస్యలు వివరించారు. రన్నింగ్ రూమ్, ముగ్గురోడ్డు ప్రాంతాల్లో ఏనాటి నుంచో నివసిస్తున్న తమను రైల్వే అధికారులు ఖాళీ చేయ మని నోటీసులు ఇచ్చారని, తాము ఎక్కడికి వెళ్లాలంటూ గొల్లుమన్నారు.

పలువురితో స్వయంగా చంద్రబాబు సమస్యలు చెప్పించుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైల్వే స్థలాల నిర్వాసితులు భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా వుంటానని, మీరు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, అధికారులు వస్తే నేనున్నా.. ఎదురు తిరగండంటూ వారికి మనోధైర్యం చెప్పడంతో మహిళలు హర్షధ్వానాలు చేశారు. ఇది కేంద్రం చేయాల్సిన పని, స్థానిక అధికారులకు సంబంధం లేదని, ఖాళీ చేయనవసరం లేదని చెప్పారు. నులకపేట వాసులు తాము ఏనాటి నుంచో ఫారెస్టు ఏరియాలో నివసిస్తున్నామని, తమను ఖాళీ చేయాలని ఆ శాఖ వారు బెదిరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ మీరు బెదరాల్సిన పనిలేదని, కాంగ్రెస్ పాలకులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, తాము మరల అవిశ్వాసం పెట్టేందుకు కూడా సిద్ధంగా వున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటీ మెజార్టీతో వుందని చెప్పారు.