February 6, 2013

అలుపెనుగని బాటసారికి ఘన స్వాగతం

' వస్తున్నా మీ కోసం' అంటూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు 'అండగా మేమున్నాం' అంటూ గుంటూరు జిల్లా తెలుగు తమ్ముళ్లు ఆత్మీయ స్వాగతం పలికారు. వస్తున్నా మీ కోసం 127వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడ బస్టాండ్ నుంచి బుధవారం ఉదయం ప్రారంభమైంది. 10:30కు అక్కడ నుంచి మొదలైన పాదయాత్ర, రాజీవ్ గాంధీ పార్కు మీదుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంది. పాదయాత్ర బ్యారేజి మీదకు వచ్చేసరికి అటు కృష్ణాజిల్లా నాయకులు, కార్యకర్తలు, ఇటు గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలతో పోటెత్తింది. ఈ సమయంలో బ్యారేజ్ పరిసర ప్రాంతాలు తెలుగు తమ్ముళ్ల చేతిలో ఉన్న పసుపు రంగు జెండాలతో ఎటు చూసినా పచ్చదనం కనిపించింది. బ్యారేజ్ వద్ద ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపించారు.

ప్రకాశం బ్యారేజి వద్దకు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, జివి ఆంజనేయులు, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్, ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మన్నవ సుబ్బారావు, పుష్పరాజ్ తదితరులు ఎదురువెళ్లారు. రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సాంబశివరావు, జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వరావు(మల్లి) ఆధ్వర్యంలో చంద్రబాబు కృష్ణమ్మ తల్లికి పూజాదికాలు నిర్వహించారు. నదీమ్మ తల్లికి పట్టు వ్రస్తాలు బహుకరించారు. వేదపండితుల ఆశీర్వచనాలు, మేళతాళాలు, తీన్‌మార్, మహిళల మంగళహారతులతో బాబు గుంటూరు జిల్లా ఆగమనం ఓ వేడుకలా జరిగింది. తొలుత బ్యారేజీ ఆరవ నెంబరు ఖానా వద్ద ఎమ్మార్పియస్ కార్యకర్తలు బాబుకు ఎదురెళ్లి ఘనస్వాగతం పలుకగా, నాలుగో నెంబరు ఖానా వద్ద మంగళగిరి దేశం నాయకులు కొల్లి లక్ష్మయ్య చౌదరి తన సతీమణితో మంగళహరతి ఇప్పిస్తూ సాదర స్వాగతం పలికారు.

తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు చేతికి కాగడా ఇచ్చి జిల్లాలో పాదయాత్రను ప్రారంభింపజేశారు. అక్కడి నుంచి యాత్ర సీతానగరంలోకి ప్రవేశించింది. చంద్రబాబుకు సంఘీభావంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పరిశపోగు శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్ చంద్రబాబును కలిసి తమ మద్దతు తెలిపారు. కార్యకర్తలతో కలసి వచ్చిన వారు 'తోడుగా మేముంటామంటూ' పాదరక్షలను బహూకరించారు.

సీతానగరం నుంచి పాదయాత్ర ఉండవల్లి సెంటర్‌కు చేరుకుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ప్రసంగం ముగిసే సరికి మధ్యాహ్నం 2:30 కావడంతో నాయకులు భోజన విరామం ప్రకటించారు. సాయంత్రం 4:30కు పాదయాత్ర ప్రారంభమైంది. ఉండవల్లి సెంటర్ నుండి యాత్ర 5:30కు తాడేపల్లి సెంటర్‌కు చేరుకుంది. మార్గ మధ్యలో చంద్రబాబును చూసేందుకు, ఆయన్ను కలిసేందుకు, మహిళలు, చిన్నా, పెద్దా అందరూ బారులు తీరారు. చేతులూ ఊపుతూ, అభివాదాలు చేస్తూ బాబు ముందుకు సాగారు. పాదయాత్ర రూట్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేస్తూ, కొన్ని చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ చంద్రబాబు ఉత్సాహంగా ముందుకు సాగారు. తాడేపల్లిలో అనారోగ్యంతో ఉన్న ఓ మహిళకు ఆర్థిక సాయం అందించారు.