February 6, 2013

పేదలపై పన్నుల భారం

విజయవాడ కార్పొరేషన్ పేదలపై ఆస్తిపన్ను భారం మోపడం దారుణంగా ఉందని చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి కృష్ణలంక, రాణిగారి తోట, సత్యంగారి హోటల్ సెంటర్లలో ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ నగరంలో నీళ్ళు సరిగారాడంలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వాటర్ స్కీం ప్రవేశ పెడితే దాన్ని సరిచేసుకుని నడిపించడం కార్పొరేషన్ వల్ల కాలేదని విమర్శించారు. ఎందుకిలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విజయవాడ కార్పొరేషన్ దివాలా తీసిందన్నారు. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు, ఏ పనీ చేయాలన్నా డబ్బులు లేవని అన్నారు. నగరంలో సామాన్యుడి బతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు చార్జీలు భారీగా పెంచారుగాని పేదవాడికి కూలి మాత్రం పెరగలేదన్నారు.

పంపు, టీవీ, ఫ్యాన్ ఉంటే వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తుంటే ఇక వారు ఎలా బతుకుతారన్నారు. అనుచితంగా కరెంటు భారం పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు వ్యాట్ భారం మరొకటి. ఇక సామాన్యుడి బతుకు ఎలా సాగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో నగ ర ప్రజలపై ఆస్తి పన్ను మోపడం మోయలేని పరిస్థితిగా ఉందన్నారు. హైవే ఉన్న చోట కింద సబ్‌వే ఉండాలి. కాని ఇక్కడ కార్పొరేషన్ వాటిని నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత ఉన్నా, పట్టించుకోలేదన్నారు. కంకర కొట్టే కార్మికులకు తమ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడను మెగా సిటీగా తీర్చి దిద్దుతానని చంద్రబాబు అన్నారు. చెప్పారు.