February 6, 2013

పాదయాత్రకు భారీ ఏర్పాట్ల


పెదకాకాని: వస్తున్నా మీకోసం అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు పొన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ ఏర్పాట్లను చేపట్టారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గురు, శుక్రవారాల్లో నంబూరు, పెదకాకాని, వెనిగండ్ల, ఏవీఎన్ కాలనీ, అగతవరప్పాడు గ్రామాల్లో జరిగే పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు అగతవరప్పాడు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బాబుకు బ్రహ్మర«థం పట్టాలని ఆయన కోరారు. అనంతరం ఏవీఎన్, వెనిగండ్ల సుందరయ్య కాలనీల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. అనంతరం వెనిగండ్లలోని చీడిపూడివారిపాలెం, యాదవపాలెం, దళితవాడ, సుగాలికాలనీ, ముస్లిం ప్రాంతం, పొలిమేర సెంటర్లలో పర్యటించి, కార్యకర్తలతో ఆయన సమా లోచనలు జరిపారు. అక్కడి నుంచి పెదకాకాని మీదుగా నంబూరు చేరుకున్నారు. నంబూరులో కృష్ణ పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైౖర్మన్ ఉయ్యూరు సతీష్‌రెడ్డి, కూసం బ్రహ్మారెడ్డి, పార్టీ నాయకులు మాకిరెడ్డి జయరామిరెడ్డి, నంబూరు రాజు, కనకరాజు, కూచిపూడి మోహన్ తదితరులతోపాటు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

వెనిగండ్లలో ద్విచక్ర వాహనంపై పర్యటన

ఎమ్మెల్యే నరేంద్రకుమార్ వెనిగండ్లలో ద్విచక్ర వాహనంపై పర్యటించారు. యాదవపాలెం వరకు వచ్చిన ఆయన అక్కడి నుంచి చంద్రబాబు రూట్‌ను పరిశీలించేందుకు దళిత వాడవైపు వెళ్ళారు. ఎన్టీఆర్ విగ్రహాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అక్కడి కార్యకర్తలతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం ఊరిలోని అనేక ప్రాంతాల్లో తిరిగారు.

నంబూరు వద్ద

ఘన స్వాగత ఏర్పాట్లు

చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం నంబూరు చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు నంబూరు దేశం నాయకులు స్వాగత ఏర్పాట్లను భారీ ఎత్తున చేపట్టారు. ఇప్పటికే నంబూరులో అన్ని ప్రాంతాల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊయ్యూరు సతీష్‌రెడ్డి, కూసం బ్రహ్మారెడ్డి, మాకిరెడ్డి జయరామిరెడ్డి తదితరులు ఈ ఏర్పాట్లను చేపట్టారు. నరేంద్ర కార్యకర్తల సమావేశంలో భారీ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. పెదకాకాని, వెనిగండ్ల తదితర గ్రామాలు పసుపుమయంగా మారాయి. అధినేతకు స్వాగతం పలికేందుకు అన్ని శ్రేణుల నుంచి జనాన్ని ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే నరేంద్ర విస్తృతంగా పర్యటిస్తున్నారు.