February 6, 2013

అవన్నీ కాకి లెక్కలే:టీడీపీ


సహకార ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులు కాకి లెక్కలు చెపుతున్నారని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. దీనిపై మంగళవారం మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు సి.ఎల్.వెంకట్రావు, కొనకళ్ళ బుల్లయ్య, బచ్చుల అర్జునుడు, ఈడ్పుగంటి వెంకట్రామయ్య ఎన్నికల ఫలితాలు వివరించారు. బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 193 సొసైటీలలో గెలుపొందారన్నారు. మంగళవారం జరిగిన డ్రాలో మరో రెండు సొసైటీలు తమ అభ్యర్థులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. స్వతంత్రులుగా ఉన్న 18 మందిలో 15 మంది తమకే మద్దతిస్తారన్నారు. మొత్తంగా 215 మందితో కేడీసీసీని కైవసం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఉందన్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, కంచి రామారావులమధ్య పోటీ నెలకొందన్నారు.

ఇంటి పోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ తమకు పోటీనే కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు సహకార వ్యవస్థలో ఇంకా లెక్కలు తెలియలేదన్నారు. ఆ రెండు పార్టీల నాయకులు ఎంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రి కె.పి.సార«థి, సామినేని ఉదయభానులు ఏసీ రూమ్‌లలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెపుతున్నారన్నారు. నిజాలు చెప్పే ధైర్యం లేని నాయకులు వాస్తవాలు ఒప్పుకోలేక పోతున్నారన్నారు. సీఎల్ వెంకట్రావు మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ కుయిక్తులతో సహకార రంగాన్ని కైవసం చేసుకోవాలనుకుంటోందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సొసైటీలున్న కృష్ణా జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేడీసీసీని దక్కించుకోవాలని కుట్ర పన్నుతోందన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌లో విడుదల చేయాల్సిన అంశాలను ఇప్పుడు విడుదల చేసి సహకార వ్యవస్థను భ్రష్టు పటిస్తున్నారన్నారు. సహకార శాఖ కమిషనర్ తాజా ఉత్తర్వులు ఇందుకు అద్దం పడుతోందన్నారు. అడ్డగోలు నిబంధనలతో సన్న, చిన్న కారు రైతులకు సొసైటీ ఎన్నికలలో ఓటు లేకుండా కాంగ్రెస్ నాయకులు చేశారన్నారు. ఫలితంగా 2005 లో 6.80 లక్షల మంది సభ్యులు ఓటర్లుగా ఉండగా ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య 2.16 లక్షలకు పడిపోయిందన్నారు. అదేవిధంగా తమకు మద్దతు పలకని సొసైటీ అధ్యక్షులకు ఓటు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. దానిలో భాగంగానే ఓవర్ డ్యూ ఉన్న సొసైటీ అధ్యక్షులను అనర్హులుగా ప్రకటించారన్నారు.

కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) మాట్లాడుతూ రైతులు తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు పాలన కోరుకుంటున్నారన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ కొత్త కొత్త చట్టాలను బయటకు తెస్తోందన్నారు. అభ్యుదయ భావాలు గల తమ పార్టీ అభ్యర్థి ఈడ్పుగంటి వెంకట్రామయ్యకు కాంగ్రెస్ నుంచి సైతం మద్దతు లభిస్తోందన్నారు.