February 6, 2013

అలు పెరగని బాటసారి ఆగమనం నేడు

గుంటూరు  బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతూ వచ్చి అక్కడ సేదతీరుతూ నాలుగు జిల్లాల్లో పంటలను సస్యశ్యామలం చేసే పవిత్ర ప్రదేశమది. తెల్లదొరల తుపాకులకు ఎదురెళ్లి రొమ్ము చూపించి కాల్చమంటూ ఎదిరించిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో నిర్మించిన వారధి అది. ఇటు గుంటూరు, అటు కృష్ణా జిల్లాలను కలిపిన ఆ వారధే పకాశం బ్యారేజ్. సరిగ్గా అక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొనసాగిస్తోన్న 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర గుంటూరు జిల్లాలో నేడు(బుధవారం) తొలి అడుగు పడనుంది.

విజయవాడ నగరంలో పాదయా త్ర నిర్వహిస్తోన్న చంద్రబాబు నేటి ఉదయం 11 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఈ నేపథ్యంలో అధినేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు టీడీపీ జిల్లా నాయకులు, శ్రేణులు పూర్తిస్థాయిలో సమయాత్తమయ్యాయి.

ఇంచుమించు 10 వేల మంది కార్యకర్తలతో చంద్రబాబుకు ఎదురెళ్లి స్వాగతం పలకాలని నాయకులు భావిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పాదయాత్రకు తరలివచ్చేలా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సహకార ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్, వైకాపాపై స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో పార్టీ జిల్లాలో పూర్వవైభవం దిశగా దూసుకుపోతోందని నాయకులు విశ్లేషిస్తున్నారు. సహకార గెలుపు ఇచ్చిన ఊపుతో చంద్రబాబు పాదయాత్రను రెట్టింపు ఉత్సాహంతో విజయవంతం చేసేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీరు, విద్యుత్ కోతలతో మూతబడుతోన్న పరిశ్రమలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం తదితర సమస్యలను ఇప్పటికే చంద్రబాబుకు నాయకులు నివేదించారు. పాదయాత్రలో భాగంగా రైతులు, మహిళలు, కార్మికులు, కూలీ లు, విద్యార్థులతో చంద్రబాబు సంభాషించి వారి సమస్యలు తెలుసుకొనేలా ప్రణాళిక రూపొందించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.

చంద్రబాబు పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని గుం టూరులోనే చేరుకోనున్న నేపథ్యంలో అందుకు గుర్తుగా భారీ పైలాన్‌ను ఆవిష్కరింప చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రకటించిన షెడ్యూల్‌కు రెండు, మూడు రోజులు ఆలస్యమైనా సరే మంగళగిరి, పొన్నూరు, గుంటూ రు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాయకులు తమ సత్తా చాటుతూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు వంటివి ఏర్పాటు చేశారు.

నేటి షెడ్యూల్ ప్రకాశం బ్యారేజ్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించి సీతానగరం, ఉండవల్లి సెంటర్, తాడేపల్లి మునిసిపాలిటీ మీదుగా సాయిబాబా దేవాలయం, నులకపేట చేరుకొని మధ్యాహ్నం భోజన విరామానికి ఆగుతారు. అనంతరం డోలాస్‌నగర్, డాన్‌బాస్కో స్కూల్ మీదుగా మంగళగిరి టౌన్‌లోని అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకొని అక్కడ ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం లక్ష్మీనృసింహస్వా మి ఆలయం మీదుగా చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చేరుకొని రాత్రికి బస చేస్తారు.