February 7, 2013

తప్పు చేయకపోతే ఇంతకాలం జైలులోనా?

మోసగాళ్లకు మోసగాడు!
ఓటేస్తే ఒడ్డున పడాలని చూస్తున్నాడు
తప్పు చేయకపోతే ఇంతకాలం జైలులోనా?
సచివాలయానికి వెళ్లకుండానే లక్ష కోట్లు
వెళ్లి ఉంటే పంచభూతాలూ మిగలవు
జగన్‌ను ఏకిపారేసిన చంద్రబాబు
గుంటూరులోకి 'మీ కోసం'
తొలి రోజు పాదయాత్రకు జనం బ్రహ్మరథం

"మోసగాళ్లకు మోసగాడు జగన్. ఆయనకు ఓటేస్తే దాన్ని తన కేసుల మాఫీకి తప్ప ప్రజలకు ఏమీ చేయడు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తమకు సమస్య కాదని, గతంలో ఒకసారి ఆ పని చేస్తే కాంగ్రెస్, వైసీపీలు డబ్బుతో రాజకీయాలను కంపు కొట్టించాయని దుయ్యబట్టారు. కృష్ణాజిల్లాలో పాదయాత్ర పూర్తి చేసుకున్న చంద్రబాబు.. బుధవారం మధ్యాహ్నం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ మీదుగా గుంటూరు జిల్లాలోకి ప్రవేశించారు. మంగళగిరి నియోజకవర్గం సీతానగరం నుంచి జిల్లాలో నడకకు శ్రీకారం చుట్టారు.

ఉండవల్లి, తాడేపల్లి, నులకపేట, దౌలత్‌నగర్, మంగళగిరి, ఎన్ఆర్ఐ ఆస్పత్రి మీదుగా 17 కిలోమీటర్లు నడిచారు. అంతకుముందు.. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన శ్రేణులు, జనంతో ప్రకాశం బ్యారేజ్ జనసాగరంగా మారింది. తెలుగు యువత నాయకులు అందించిన పట్టు వ్రస్తాలను చంద్రబాబు కృష్ణానదిలో జారవిడిచారు. ర్రాష్టాన్ని సస్యశ్యామలం చేయాలని కృష్ణమ్మకు నమస్కరించారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డప్పు కొట్టి శ్రేణులు ఉత్సాహపరిచారు. సీపీఐ జిల్లా నాయకులు, ఎంఆర్‌పీఎస్ నాయకులు జెండాలతో వచ్చి స్వాగతం పలికారు. ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు స్వహస్తాలతో తయారు చేసిన పాదరక్షలను బాబుకు బహూకరించారు.

అక్కడ ఇంచుమించు ముప్పావుగంట పాటు మండుటెండలో నిలబడి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, వైసీపీలను తూర్పారబట్టారు. "జగన్ ఏనాడైనా సచివాలయానికి వెళ్లారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండానే ఆయన రూ. లక్ష కోట్లు దోచారు. అదే వెళ్లి ఉంటే రాష్ట్రంలో పంచభూతాలూ మిగిలేవి కావు'' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2004లో వైఎస్ సీఎం కాగానే రాష్ట్రంలో దోపిడీకి బీజం పడిందని ఆరోపించారు. "2009 ఎన్నికలకు ముందు ఎక్కువ డబ్బులు పెట్టి విద్యుత్ కొనుగోలు చేసి వైఎస్ పోయారు. 'కిరికిరి' సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చి వీటీపీఎస్‌కు నాసిరకం బొగ్గు పంపించి డబ్బులు కొట్టేశారు'' అని ఆరోపించారు.

కృష్ణానదిలోని భవానీ ద్వీపాన్ని పర్యాటక ప్రదేశంగా తాను అభివృద్ధి చేయగా, రియల్ ఎస్టేట్ పేరుతో దాన్నీ కొట్టేయడానికి కాంగ్రెస్ దొంగలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజలకు 100 చదరపు గజాల స్థలం ఇవ్వని వైఎస్ తన అల్లుడికి మాత్రం బయ్యారంలో లక్షన్నర ఎకరాల గనులను ధారాదత్తం చేశారని ఆరోపించారు. "జగన్‌కు బెయిల్ ఎందుకు రావడం లేదో ప్రజలు ఆలోచించాలి. జగన్ రూ. లక్ష కోట్లు దోచారని సాక్ష్యాత్తు ఒక న్యాయమూర్తే అన్నారు. దీనిని బట్టి జగన్ చేసిన నేరం ఎంత తీవ్రమైందో తెలుస్తోంది'' అని ప్రజలకు వివరించారు. గుంటూరు, విజయవాడ నగరాలను తాను అధికారంలోకి వస్తే జంటనగరాలుగా చేసి ఐటీ హబ్‌గా మారుస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. రెండు నగరాలకు ఔటర్ రింగు రోడ్డు నిర్మించి దాని నుంచి అంతర్గత రహదారులు ఏర్పాటు చేసి మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తానన్నారు.