February 7, 2013

అభిమానమే నడిపిస్తోంది

దళితులు, మైనారిటీలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు... వీరందరి కష్టాలు తీర్చడమే నా ప్రధాన లక్ష్యం. ఏ వర్గాల కోసం పాదయాత్ర కార్యక్రమం చేపట్టానో... ఆ వర్గాలకు చెందిన వారందరినీ నేడు కలిశాను. వారితో మనసు విప్పి మాట్లాడాను. వారి వాడలకు వెళ్లాను. వీధుల్లో తిరిగాను. వారు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో తెలుసుకున్నాను.

గుంటూరు జిల్లాలో కాజా గ్రామం వద్ద మాదిగ తమ్ముళ్లు నన్ను కలిశారు. తమ పల్లెలోకి రావాలని పట్టుపట్టారు. నా యాత్ర మార్గంలో వారి గ్రామం లేనప్పటికీ... నా పట్ల వారు చూపిస్తున్న అభిమానమే నన్ను అటువైపు నడిపించింది. వర్గీకరణ చేస్తానన్న నా మాటపై ఉన్న నమ్మకంతో వారు పాదయాత్ర ఆసాంతం నాకు అండగా నిలుస్తున్నారు. తమకు జరిగిన అన్యాయానికి తెలుగుదేశం పార్టీ ద్వారానే సమాధానం లభిస్తుందని వారు గట్టిగా భావిస్తున్నారు. వారికి కచ్చితంగా న్యాయం చేస్తాను. కాజా గ్రామంలోనే దళిత క్రిస్టియన్ సోదరులను కలిశాను. క్రైస్తవులుగా మారినంత మాత్రాన వారిలో పేదరికం పోలేదు. కొందరు వారిని ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. ప్రతి దానినీ రాజకీయాలతో ముడిపెట్టడం బాధాకరం.

నంబూరు సభలో ముస్లిం సోదరులు ఓ సభ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మైనారిటీ విధానం వారిలో కొత్త ఆశలు కల్పించింది. వారిని నమ్మకాన్ని వమ్ము చేయను. ఇదే గ్రామంలో రజకులు నన్ను కలిశారు. వారి కష్టాలు చెప్పుకొన్నారు. ఓ సీనియర్ నేతగా, బాధ్యతగల పార్టీకి అధ్యక్షుడిగా కుల మతాలకు అతీతంగా పేదవాళ్లందరికీ అండగా ఉండి, వారిని పైకి తీసుకు రావాలన్నదే నా తాపత్రయం.