February 7, 2013

సీఎం కుర్చీ ఇవ్వలేదనే జగన్ పిల్ల కాంగ్రెస్ ఏర్పాటు

అందరికీ వర్తించే విధంగా ఆరోగ్య భీమా
మిర్చి రైతుల కోసం బోర్డు ఏర్పాటు
కిరణ్ కిరికిరి ముఖ్యమంత్రి : చంద్రబాబు

ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వలేదనే జగన్మోహన్‌రెడ్డి పిల్ల కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారని, జైలు పార్టీకి ఓటేస్తే మీరూ జైలుకెళతారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జగన్‌కు బెయిల్ ఎందుకు రావడంలేదో ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. జగన్ లక్ష కోట్లు దోచారని సాక్ష్యాత్తు ఒక న్యాయమూర్తే అన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. దీనిని బట్టి జగన్ చేసిన నేరం ఎంత తీవ్రమైందో తెలుస్తోందని ఆయన ప్రజలకు వివరించారు.

గురువారం ఉదయం ఎస్ఆర్ఐ వైద్య కళాశాల నుంచి 129వ రోజు పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ వర్తించే విధంగా ఆరోగ్య భీమా ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మిర్చి రైతుల కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

గుంటూరు, విజయవాడ నగరాలను జంటనగరాలుగా చేసి ఐటీ హబ్‌గా మారుస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారు. రెండు నగరాలకు ఔటర్ రింగు రోడ్డు నిర్మించి దాని నుంచి అంతర్గత రహదారులు ఏర్పాటు చేసి మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తానన్నారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరీల ముఖ్యమంత్రని, ఆయనకు విషయ పరిజ్ఞానం లేదని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా జిల్లాలో చంద్రబాబు యాత్రకు అనూహ్యంగా స్పందన వచ్చింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి బాబుకు నీరాజనాలు పలుకుతున్నారు.