February 7, 2013

ప్రతి ఆదివారం పాదయాత్రకు సెలవు


ఇక నుంచి ప్రతీ ఆదివారం తన పాదయాత్రకు విరామం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విరామం రోజున టీడీపీ జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీని వలన పార్టీలోని లోటుపాట్లు సరిదిద్దే అవకాశం కలగడంతో పాటు నాయకుల పనితీరును తెలుసుకోవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు తీసుకొన్న ఈ తాజా నిర్ణయంతో ఆదివారం పాదయాత్రకు విరామం లభించనుంది.

అన్ని మతాలను గౌరవించాలి: బాబు

మంగళగిరి: ఒక పార్టీ అన్ని మతాలను గౌరవించాలని చంద్రబాబు చెప్పారు. పాదయాత్రలో భాగంగా.. కాజలో టీడీపీ రాష్ట్ర క్రైస్తవ విభాగం ఏర్పాటు సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. పేద వాడికి సహాయ పడాలనే విషయం బైబిల్‌లో స్పష్టంగా చెప్పారన్నారు. క్రైస్తవులలో యువతకు, మహిళలకు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక పరిపుష్టి లభించే చర్యలు చేపట్టాలన్నారు.

టీడీపీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని, కొన్ని పార్టీలు కొన్ని కులాలను, మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాయని, అది సమర్థనీయం కాదన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రులు జేఆర్.పుష్పరాజ్, పెద్దిరెడ్డి, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డేవిడ్ శాంతరాజు, జనరల్ సెక్రెటరీ జాన్ వెస్లీ, ఉపాధ్యక్షులు పీఎండీ.వరప్రసాద్, సెక్రెటరీలు హేలెన్‌బాబు, రాజ్‌కుమార్ చిట్టి, పాస్టర్లు, బిషప్‌లు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.