February 7, 2013

నా కాళ్లకు బలం వీళ్లే!

నా కాళ్లకు బలం ఈ కార్యకర్తలే. నడుస్తుంది నేనైనా ఉత్సాహంగా మునుముందుకు నన్ను నడిపిస్తుంది వీళ్ల అభిమానధనమే. పాదయాత్ర తొలిరోజు నుంచీ వెంట ఉన్నవారు కొందరైతే, జిల్లాలకు వెళ్లినప్పుడు ఎదురొచ్చి.. తమ జిల్లా పొలిమేరల దాకా వెంట నడిచి వీడ్కోలు చెప్పేవారు మరికొందరు. ఇంతమంది ఇంత కష్టపడుతున్నారు కాబట్టే నేను వేరే ఆలోచన లేకుండా జనంతో మమేకం కాగలుగుతున్నాను. విజయవాడ నుంచి గుంటూరుకి వస్తున్నప్పుడు ఎందుకో తెలియని భావోద్వేగం కమ్మేసింది. నాలోనే కాదు, ఆ కార్యకర్తల్లోనూ కన్నీటి చెమ్మ కదలాడింది. అయినా, ఉత్సాహంగానే నన్ను గుంటూరు జిల్లాకు అప్పగించి వెనుదిరిగారు. వీళ్లకు ఎంత రుణపడ్డానో!

ప్రకాశం బ్యారేజ్ దాటి ఉండవల్లిలో అడుగుపెట్టగానే తాటాకుల గుడిసెల్లోంచి బిలబిలమంటూ జనం బయటకు వచ్చారు.యాత్ర సాగుతున్న మార్గంలో నాలుగైదు చోట్ల మహిళలు గుమిగూడటం కనిపించింది. "ఏమమ్మా ఎలా ఉన్నారు'' అంటూ దగ్గరకెళ్లాను. 'ఎలా ఉంటాం సార్.. మంచినీళ్లు బిందెలు పట్టుకొని క్యూలో నిలుచున్నాం. ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట నీళ్లిస్తారు.

తోసుకెళ్లి బిందె ముందుపెడితే నీళ్లు దొరికినట్టు.. లేదంటే లేదు. రోజూ నీటి యుద్ధాలే'' అంటూ నిట్టూర్చారు. పక్కనే కృష్ణా జలాలు పారుతున్నా గుక్కెడు మంచినీళ్లు సౌకర్యం కూడా కల్పించలేని ఈ పాలకులు దేనికి? ఈ గ్రామంలో ఎక్కడా పక్కా గృహమే కనిపించలేదు. అన్నీ తాటాకు కప్పులే. అవి ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు. చిన్నపాటి గాలివాన వచ్చినా బతుకు అతలాకుతలమే. రాష్ట్రమంతా లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని ఊదరకొట్టే పాలకులు..ఉండవల్లి ప్రజలకు ఏమి చెబుతారు?