February 7, 2013

జగన్ అవినీతిపరుడని జడ్జీలు నమ్మారు అందుకే బెయిల్ ఇవ్వడం లేదు

కిరణ్‌కు ఫోజెక్కువ
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు
ప్రజలపై పెద్ద కరెంటు బాంబు వేయబోతున్నారు
జగన్ అవినీతిపరుడని జడ్జీలు నమ్మారు
అందుకే బెయిల్ ఇవ్వడం లేదు
గుంటూరు పాదయాత్రలో చంద్రబాబు

రాష్ట్రంలో ప్రస్తుతమున్నది చెత్త ప్రభుత్వమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డికి సబ్జెక్టు తెలియదని, అయినా సరే తనకంతా తెలుసన్నట్లుగా ఫోజులు కొడుతుంటారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలపై రెండు కరెంటు బాంబులు వేసిన కిరణ్.. మరో పెద్దబాంబు వేయబోతున్నారని చెప్పారు. ర్రాష్టాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రి నుంచి రెండో రోజు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రను కొనసాగించారు.

మండుటెండలో నడక కొనసాగిస్తూ విద్యార్థులు, మహిళలు, వృద్ధులతో సంభాషిస్తూ వారి సమస్యలు తెలుసుకొంటూ ముందుకుసాగారు. తాను అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలు ఇప్పటివరకు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి వాళ్ల బ్యాంకు ఖాతాల్లో జమచేయిస్తానని చెప్పారు. మహిళలు ఆత్మగౌరవంతో డబ్బులు సంపాదించుకొనే మార్గాన్ని చూపిస్తానని వాగ్దానం చేశారు. పేదవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతానని చెప్పారు. జగన్ అవినీతిని చంద్రబాబు మరోసారి ఎండగట్టారు. "జగన్‌కు ఏ న్యాయమూర్తి బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. న్యాయవ్యవస్థ ఎంతో పటిష్ఠమైనది. తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు''అని పేర్కొన్నారు.

సాక్షి ఒక విషకన్య
సాక్షి పత్రిక, టీవీ రాస్తున్నవి, చూపిస్తున్నవి అన్నీ అసత్యాలేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సాక్షి'ని విషకన్యగా ఆయనన అభివర్ణించారు. "చరిత్రలో ఒక రాజు విషకన్యకు విషం ఎక్కించి తనకు ఇష్టంలేని వాళ్లను చంపేందుకు ఉసిగొల్పుతాడు. అలాంటి విషకన్యే సాక్షి. ప్రజల భూములు బడాబాబులకు దోచి పెట్టి అందులో పెట్టుబడులు పెట్టించారు. అది రాసేవన్నీ తప్పుడు రాతలే. నా పాదయాత్రకు లభిస్తోన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక అడ్డగోలు రాతలు రాస్తోంది'' అని ధ్వజమెత్తారు. కాజలో టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్‌ను కొత్తగా ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాదయాత్రకు ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళగిరి మండలం కాజ గ్రామానికి వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు.

చంద్రబాబు ప్రసంగాలకు 'ఎన్నికల కోడ్ '
ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల పేరుతో చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్రకు, ప్రసంగాలకు గుంటూరులో పోలీసులు అడ్డు చెప్పారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రాత్రి పది దాటిన తరువాత రాజకీయ నాయకులు ఎటువంటి ప్రచారం, ప్రసంగాలు చేయకూడదని పోలీసులు చంద్రబాబుకు సూచించారు. దీంతో గురువారం రాత్రి ఆ సమయానికి పెదకాకాని మండలం నంబూరులో చంద్రబాబు ప్రసంగాలు ముగించుకున్నారు. మౌనంగా పాదయాత్ర నిర్వహించి పెదకాకానిలోని శంకర కంటి వైద్యశాల ప్రాంగణానికి చేరుకున్నారు.

బాబుకు డీహైడ్రేషన్: వైద్యులు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాతావరణం పగలు మండుటెండ, సాయంత్రం చలిగా ఉంటోందని, ఎక్కువసేపు చంద్రబాబు ఎండలో నడవడంతో డీహైడ్రేషన్‌కు గురవుతున్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బాబుకు గొంతు నొప్పి ఉండటంతో ప్రసంగాల సమయాన్ని తగ్గించుకోవాల్సిందిగా ఆయనకు సూచించానన్నారు. ఎడమ కాలి చిటికెన వేలు నొప్పి తిరగబెడుతూనే ఉందన్నారు. రెండు, మూడు రోజుల్లో వైద్యబృందం బాబును పరీక్షించేందుకు వస్తుందన్నారు.