February 7, 2013

సోలార్ ఫ్యాన్ క్యాప్ పెట్టిన అధినేత

సోలార్.. సార్!
పాదయాత్రలో తొలిసారి దర్శనం

గుంటూరు జిల్లాలో ఎండ విరగ కాయడంతో చంద్రబాబు సోలార్ ఫ్యాన్ క్యాప్‌ను ధరించారు. ఈ ఫ్యాన్ సౌరశక్తితో పనిచేస్తుంది. ఫ్యాన్ తిరుగుతూ ముఖంభాగం వరకు చల్లని గాలి వీస్తుంది. ప్రకాశం బ్యారేజి వద్దకు చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వేసవిని తలపించినట్లుంది. ప్రతిరోజూ ఎండ వేడిమి తట్టుకోవడానికి చంద్రబాబు పెట్టే క్యాప్ కాకుండా తొలిసారిగా మొఖంపై ఎదురెండ పడకుండా చల్లదనాన్ని ఇచ్చే పసుపు పచ్చని సోలార్ క్యాప్‌తో దర్శనమిచ్చారు.

ఈ క్యాప్‌ల తయారీకి బెంగళూరు, పుణె ప్రసిద్ధి. ఈ క్యాప్‌కు పై భాగంలో చిన్న సోలార్ ప్యానెల్ బిగించి ఉంటుంది. అది సూర్యరశ్మిని గ్రహించి సోలార్ శక్తిని ఎల్రక్టికల్ శక్తిగా మారుస్తుంది. ఆ శక్తి సోలార్ సెల్‌లో నిక్షిప్తమౌతుంది. అక్కడ నుండి చిన్న వైరు ద్వారా క్యాప్ ముందు భాగంలోని ప్లాస్టిక్ ఫ్యాన్‌కు కనెక్టు చేస్తారు. ఎండ తీవ్రతను బట్టి ఫ్యాన్ వేగం మారుతుంది. వద్దనుకున్నప్పుడు ముందు భాగంలో ఉండే చిన్న స్విచ్‌తో ఆఫ్ చేసుకోవచ్చు. ఇది పనిచేయడానికి సోలార్ శక్తి నుండి వచ్చే ఐదు వోల్టుల కరెంట్ సరిపోతుంది.