February 8, 2013

మీ కష్టాలు చూస్తే దుఖం

నేను చినకాకాని ఊరంతా తిరిగాను. అందరితో మాట్లాడా. మీరు చూపిస్తోన్న అభిమానం నాకు కొండంత బలాన్ని ఇస్తోంది. అయితే మీ కష్టాలు చూస్తే దుఃఖం తన్నుకొస్తోంది. మండుటెండ మిమ్మల్ని చూసి భయపడుతోంది. మీ అభిమానం చూస్తే నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోందని చినకాకాని గ్రామస్థులతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. చినకాకానిలో పాదయాత్ర ముగింపు సమయంలో స్థానిక సమస్యలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ గ్రామ రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో నెట్టి వేయబడ్డారని చెప్పారు. క్యాలీఫ్లవర్‌కు ఇక్కడ ధర లేదు. బజారకు వెళితే కొనలేని పరిస్థితి కొనసాగుతోందన్నారు.

చినకాకాని గ్రామానికి 127 ఇళ్లు మంజూరు చేశారని, వాటిల్లో సగం కాంగ్రెస్ దొంగలు కొట్టేశారని ఆరోపించారు. న్యాయబద్ధంగా ఇళ్లు నిర్మించుకొన్న వారికి బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. చివరికి పంచాయితీ ఆదాయం కూడా తినేసే పరిస్థితికి వచ్చారని చెప్పారు. నాడు ఎన్‌హెచ్-5ను తానే నిర్మించానని, దాంతో భూముల ధరలు పెరిగాయన్నారు. అంతేకాకుండా గ్రామస్థుల పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించి విదేశాలకు, బెంగుళూరు, హైదరాబాద్ వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. అయితే నేడు ఉద్యోగాలు లేకుండా చేసి, వ్యవసాయాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భారంగా మార్చేసిందన్నారు. రైతులను అన్ని విధాలుగా కాంగ్రెస్ నాశనం చేసిన నేపథ్యంలో వారు బ్యాంకుల్లో చేసిన అప్పులన్నింటిని మాఫీ చేసేందుకు తాను రుణమాఫీ హామీ ఇచ్చానన్నారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీ పైనే ఉంటుందని స్పష్టం చేశారు.