February 8, 2013

రుణమాఫీపై చంద్రబాబు సవాల్

సీఎం.. చర్చకు వస్తావా?
రైతు సంక్షేమంపై తేల్చుకుందాం..రా
సాగు గురించి నీకేం తెలుసు?
నీ వల్ల రోజుకు ఐదు ఆత్మహత్యలు
దొంగలను కాపాడుతున్నావు
'అవినీతి' ధర్మానతో సమీక్షా?
గుంటూరు జిల్లా పాదయాత్రలో నిప్పులు

రాష్ట్రంలో రైతాంగానికి రుణమాఫీ సాధ్యం కాదన్న సీఎం కిరణ్ ప్రకటనపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. "అసలు వ్యవసాయం అంటే నీకేం తెలుసు? నీ వల్ల రోజుకు ఐదుగురు రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నారు'' అంటూ నిప్పులు చెరిగారు. రైతు సంక్షేమం కోసం ఎవరేమి చేసిందీ చర్చించడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా పెదకాకాని నుంచి శుక్రవారం పాదయాత్ర ప్రారంభించిన బాబు.. ఆసాంతం ప్రభుత్వం, సీఎం కిరణ్‌పై విమర్శలు గుప్పించారు. "మేము వ్యవసాయానికి 9 గంటల కరెంటిస్తే నేడు 2 గంటలు కూడా ఇవ్వట్లేదు. డీఏపీ బస్తా రూ.400లకు ఇస్తే అది రూ.1300లకు పెంచారు. రుణమాఫీ సాధ్యం కాదంటున్నావు'' అని విమర్శించారు.

నీలం తుఫాను, కరువు, వరదలు ముంచెత్తినా కేంద్రం నుంచి నష్టపరిహారం ఇప్పించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. వాన్‌పిక్ వ్యవహారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు సీఎం అడ్డుపడ్డారన్నారు. సీఎం అనుమతి అవసరం లేదని ఒకవైపు కోర్టు చెబుతున్నా, సదరు మంత్రిని పిలిచి సమీక్ష చేయడం ఏమిటని ప్రశ్నించారు. దొంగలను కాపాడుతూ సీఎం దొంగలకు దొంగగా మారారని తీవ్ర ఆరోపణ చేశారు. గట్టిగా చర్య తీసుకొంటే మంత్రులంతా చంచల్‌గూడ జైలుకు పోవడం ఖాయమని పేర్కొన్నారు. జైలు పార్టీని గెలిపిస్తే మనందరి జీవితాలూ జైలుపాలు కావడం ఖాయమన్నారు.

"2004 ఎన్నికలకు ముందు తాను అప్పుల్లో ఉన్నానని, బంజారాహిల్స్‌లోని జాగాను అమ్ముకొని రుణాలు తీర్చుకొనేందుకు అనుమతి కోసం వైఎస్ నాకు లేఖ రాశారు. అది కబ్జా భూమి అని తేలడంతో ఆ దరఖాస్తు పక్కన పడేశాను. అలాంటిది అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోనే రూ.లక్ష కోట్లు దోచేశారు'' అని వివరించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఎక్కువ సంఖ్యలో గెలిపిస్తే వంట గ్యాస్ ధర దిగి వచ్చేలా చేస్తానని మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. "నేను చెబుతున్న విషయాలను కుటుంబంలో అందరూ చర్చించుకొని నమ్మితే నాకు ఓటు వేయండి. లేకుంటే మీ ఇష్టమ''ని వ్యాఖ్యానించారు.

11నుంచి జిల్లా నేతలతో సమీక్షలు
హైదరాబాద్: ఈ నెల 11వ తేదీ నుంచి జిల్లాల నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న నిజామాబాద్, 12న కరీంనగర్, 13న మెదక్, 14న రంగారెడ్డి, 15న మహబూబ్‌నగర్, 16న వరంగల్ జిల్లాల సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, జిల్లా ముఖ్య నేతలు హాజరు కావాల్సి ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు పాదయాత్ర జరిగే ప్రదేశంలో ప్రతి రోజు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. కాగా, ఆదిలాబాద్ జిల్లా సమీక్ష మాత్రం శుక్రవారం జరిగింది. ఇటీవలి సహకార ఎన్నికలు, పల్లె పల్లెకూ తెలుగుదేశం కార్యక్రమం, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈ సమీక్షల్లో చర్చించారు.