February 8, 2013

ఈ నేలంతా రైతు కన్నీరే..!

అన్నదాతా! సుఖీభవ అంటారు. రైతు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనేది భావం. ఎన్ని కష్టాలకైనా ఓర్చి పంట తీస్తాడు కాబట్టే జవాను తరువాత జాతిమొత్తం గుర్తించేది కిసానునే. వెనిగండ్లలో అడుగుపెట్టిన సమయంలో ముప్పెరగా ముసురుకున్న ఆలోచనలివి. ఆ రైతును చూసినప్పుడు ఆయనతో పాటు నా కళ్లూ తడిచాయి. బెండకాయలను గుప్పిట్లో పట్టుకొని వచ్చాడు. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు గానీ, గొంతు పూడుకుపోవడంతో మాట పెగలలేదు. పరిస్థితి అర్థమయింది. ఆయన మూగవేదనను ఒక రైతుబిడ్డగా మాటలతో పని లేకుండానే తెలు సుకోగలిగాను. భుజంపై చెయ్యి వేసి ధైర్యం చెప్పాను. ఆయనా, చుట్టుపక్కల రైతులు చెప్పిన దాన్నిబట్టి, యాభై వేలు అప్పుచేసి రెండు ఎకరాల్లో బెండ నాటాడు. అంత డబ్బు పోసినా కాయ సరిగ్గా ఎదగలేదు. నకిలీ విత్తనాలే కారణమట. షాపు యజమానిని నిలదీయగా, "కావాలంటే రెండు సంచుల విత్తనాలు తీసుకెళ్లు. అంతకుమించి నన్నేమి అడగొద్దు'' అని తరిమేశాడట. ఎంత కష్టం.. ఎంత నష్టం!

వేసిన పంట కాపుకు రాలేదనేది ఒకరి బాధ అయితే, ఎదిగిన బిడ్డను ఇంట్లో పెట్టుకున్నట్టుగా, పండిన పత్తిని ఇంట్లో పెట్టుకోవడంపై కుమిలే గుండె మరొకరిది. ఆ రైతు నన్ను తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. నాకు మర్యాద చేయడానికి చూశాడుగానీ, ఇల్లంతా పత్తితో నిండిపోవడంతో మంచం వేయడానికీ జాగా కనిపించలేదు. "'ధర లేదు. ఏం చేయమంటారు సార్. ఇలా ఎన్నాళ్లు పెట్టుకోవాలో అర్థం కావడం లేదు'' అని వాపోయాడు. ఇలా రైతులు కన్నీరుపెడుతుంటే, ఇక ఈ భూమి ఎలా సస్యశ్యామలం అవుతుంది?