February 8, 2013

మద్దతు ఇవ్వొద్దు.. తీసుకోవద్దు:బాబు

రాష్ట్ర, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికలకు సంబంధించి అన్నిచోట్లా టీడీపీ అభ్యర్థులను పోటీ పెట్టాలని జిల్లా నాయకత్వాలను చంద్రబాబు ఆదేశించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో చిత్తూరు జిల్లా నేతలతో శుక్రవారం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వవద్దని, ఎవరి నుంచీ తీసుకోవద్దని ఆదేశించారు. ఈ ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన ప్రతిచోటా పార్టీ గెలిచిందని చెప్పారు. దీనిని గుణపాఠంగా తీసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారి రుణం తీర్చుకొంటామని హామీ ఇచ్చారు.

ఎవరెన్ని లక్షలు ఇచ్చినా మన పార్టీ నేతలు అమ్ముడుపోరన్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. నిబద్ధత, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని పని చేస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లు గెలుచుకొనే సత్తా టీడీపీకి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీకి కేడర్ లేదని సహకార ఎన్నికలతో తేలిపోయిందని, ఆ పార్టీ బతికి బట్ట కట్టగలిగే పరిస్థితి లేదని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు. టీడీపీ కాస్త కష్టపడి ఉంటే సహకార ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన కొన్ని స్థానాలు కూడా గల్లంతు అయి ఉండేవన్నారు.