February 8, 2013

జైలు పార్టీతో జాగ్రత్త..

జిల్లాలో చంద్రబాబు తన రెండో రోజు పాదయాత్ర మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల నుంచి ప్రారంభించారు. ఎన్‌హెచ్-5 మీదుగా నడుస్తూ చినకాకాని గ్రామంలోకి ప్రవేశించారు. రెండు చోట్ల టీడీపీ జెండాలను ఆవిష్కరించి ఎన్‌టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రసంగించారు. సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా తాము ముందుకుపోతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ర్రాష్టాన్ని భ్రష్టు పట్టించి అన్ని విధాలుగా దెబ్బ తీసిందని చెప్పారు.

ఇక్కడి మిర్చి రైతులు తమను ఆదుకోమని అడుగుతున్నారంటే చేత కాని అసమర్థ ప్రభుత్వం రైతుల నడ్డి ఏ విధంగా విరిచిందో స్పష్టమౌతోందన్నారు. వెనకబడిన వర్గాలకు రూ. 10 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొంటానని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులను ఆదుకొనేందుకు రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తానన్నారు. గతంలో ఎస్‌సీ వర్గీకరణ అమలు చేసి 24 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, కాంగ్రెస్ పార్టీ 44 ఏళ్లలో కేవలం 14 వేల ఉద్యోగాలే ఇచ్చిందన్నారు. మరలా ఎస్‌సీ వర్గీకరణ అమలు చేసి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.చంద్రబాబు తన ప్రసంగాల ద్వారా మహిళల నాడి పట్టుకొనే ప్రయత్నం చేశారు. తాను డ్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమం నేర్పించి న్యాయంగా డబ్బులు సంపాదించే మార్గం చూపించానని, కాంగ్రెస్ వాళ్లు మాత్రం డబ్బు పొగొట్టుకొనే దారి చూపించారని ఎద్దేవా చేశారు. ఆడపిల్లలపై వివక్ష పోగొట్టేందుకు నాడు అమ్మాయి పుడితే రూ. ఐదు వేలు బ్యాంకులో డిపాజిట్టు చేయించానని గుర్తు చేస్తూ నాడు ఇంటింటికి తలుపు తట్టి 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇప్పించానన్నారు. తన పాలనలో ఏరోజూ గ్యాస్ ధరను పెరగనీయలేదని, నేడు రూ. 475 అయిందని, అది కూడా సంవత్సరానికి ఆరు సిలిండర్లు మాత్రమే ఇస్తాంటున్నారని చెప్పారు. మున్ముందు ఆధార్‌తో లింకు పెట్టి గ్యాస్ వినియోగదారులను ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మరలా కట్టెల పొయ్యిలు వెలిగించే పరిస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కేంద్రం రూ. 400 పెన్షన్ ఇస్తే వీళ్లు రూ. 200 మాత్రమే ఇస్తూ మిగతాది కొట్టేస్తున్నారని ఆరోపించారు.

వ్యవసాయాధారిత


పరిశ్రమలు తీసుకొస్తా


గుంటూరు, విజయవాడ మధ్యన అవుటర్ రింగు రోడ్డు ఏర్పాటు చేసి వ్యవసాయాధారిత పరిశ్రమలు తీసుకొస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలానే ఆటోమొబైల్ పరిశ్రమ నెలకొల్పుతామన్నారు. విజయవాడ-గుంటూరును కలిపేసి మహానగరంగా అభివృద్ధి చేసి ఇక్కడ చదువుకొన్న పిల్లకలు స్థానికంగానే ఉద్యోగాలు వచ్చేలా బాధ్యత తీసుకొంటానని చెప్పారు.

అన్ని ఇళ్లకు కృష్ణాజలాలు

కృష్ణానది చెంతనే ఉన్నా గుంటూరు జిల్లా తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతీ ఇంట్లోకి కృష్ణా జలాలు తీసుకొచ్చి తాగునీటి సమస్య లేకుండా చేస్తానని చంద్రబాబు హామీఇచ్చారు.

చినకాకాని వద్ద ఫ్లైవోవర్

చినకాకాని గ్రామం వద్ద ఎన్‌హెచ్-5పై ఫ్లైవోవర్ లేక సబ్ వే నిర్మాణానికి చర్యలు తీసుకొంటానని చెప్పారు. దీని వలన ప్రజలు రోడ్డుకు అటువైపున ఉన్న పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం చేసుకొనేందుకు సమస్య తొలగిపోతుందన్నారు. చంద్రబాబు వెంట పాదయాత్రలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, డాక్టర్ శనక్కాయల అరుణ, పార్టీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, షాలిని, వైవీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

కాజలో

టీడీపీ క్రిస్టియన్ సెల్ ఏర్పాటు


మంగళగిరి రూరల్: ఒక రాజకీయ పార్టీ అన్ని మతాలను గౌరవించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయడు చెప్పారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో భాగంగా కాజ గ్రామంలో ఆయన ప్రసంగించారు. కాజలో టీడీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ ఏర్పాటైన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేదరికం ఎక్కడ వుంటే అక్కడ న్యాయం జరగాలని అన్నారు. పేద వాడికి సహాయ పడాలనే విషయం బైబిల్‌లో స్పష్టంగా చెప్పారన్నారు. భారతదేశంలో వివిధ మతా లు, ప్రాంతాలు వున్నాయని, మనందర్ని దేవుడు పుట్టించాడని తెలిపారు. పలానా కులంలో పుట్టాలనేది ఎవరి చేతుల్లో లేదన్నారు. మతమనేది ఒక విశ్వాసం. ఒక రాజకీయ పార్టీగా అన్ని మతాలను గౌరవించాలి. భారతదేశం మత సామరశ్య దేశమని, వివిధ మతాలు, ప్రాంతాలు, కులాలు వున్నాయన్నారు. క్రిస్టియన్స్ యువతకు, మహిళలకు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక పరిపుష్టి లభించే చర్యలు చేపట్టాలన్నారు. నూతన కమిటీ ప్రతి క్రిస్టియన్ హృదయాల్లోకి చొచ్చుకుపోవాలని సూచించారు. రాష్ట్ర క్రిస్టియన్ సెల్ ఏర్పాటై కాజ గ్రామం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. క్రిస్టియన్స్‌కు నూతన అధ్యయనం ప్రారంభించేందుకు వీలుగా నిర్దిష్టమైన విధానాలను రూపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు జేఆర్.పుష్పరాజ్, పెద్దిరెడ్డి, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డేవిడ్ శాంతరాజు, జనరల్ సెక్రెటరీ జాన్ వెస్లీ, ఉపాధ్యక్షుడు పీఎండీ.వరప్రసాద్, సెక్రెటరీలు హేలెన్‌బాబు, రాజ్‌కుమార్ చిట్టి, పాస్టర్లు, బిషప్‌లు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.