February 8, 2013

2014లో విజయం మనదే,

రుణ మాఫీ చేసి చూపిస్తా
రైతుకోసం ఎవరు ఏం చేశారో చర్చకు రెడీ
కిరణ్‌కు చంద్రబాబు సవాలు

రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దాం రమ్మని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారంనాడు సవాలు విసిరారు. సహకార ఎన్నికలలో రైతుకోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంవల్లే గెలిచామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారంనాడు ప్రకటించడంతో చంద్రబాబు ఇలా స్పందించారు.

రైతులకు ఏదో చేశామని జబ్బలు చరుచుకుంటున్నారు, కిరణ్ రైతులకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కిరణ్ ప్రభుత్వం చేతకానితనం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ చెబుతుంటే అది అసాధ్యం అని కిరణ్ గురువారంనాడు వ్యాఖ్యానించడాన్ని బాబు తప్పు పట్టారు. మీ అనుభవం ఎంత ? పాలనలో మీ అనుభవం ఏమిటి ? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణ మాఫీ ఎలా చేయవచ్చే తాము చేసి చూపిస్తామని ఆయన అన్నారు.

నీలం తుపాను, వరదలవల్ల రైతులు నష్టపోయినా ఈ ముఖ్యమంత్రి కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేకపోయారని చంద్ర బాబు నాయుడు దుమ్మెత్తిపోశారు. ఇది కిరణ్ అసమర్థత అని ఆయన చెప్పారు, స్వామి నాథన్ కమిషన్ సిఫార్సులను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలేకపోతున్నదని ఆయన విమర్శించారు.

ఇటు కాంగ్రెస్, అటు జగన్ కాంగ్రెస్ రెండూ గజ దొంగ పార్టీలు అని ఆయన అభివర్ణించారు. వారికి ఓటేస్తే ఊళ్లు కూడా అమ్మేస్తారని ఆయన విమర్శించారు. 2014 ఎన్నికలలో విజయం తెలుగుదేశం పార్టీదేనని ఆయన చెప్పారు. కుప్పంలో లాగా అన్ని చోట్లా ముందుగా ఒక ప్రణాళిక ఉన్నట్టయితే సహకార సంస్థల ఎన్నికలలో మరిన్ని సీట్లు సంపాదించేవారిమని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ జైలులో పెట్టి ఆనందిస్తున్నారని ఆయన ఆక్షేపించారు,