February 9, 2013

చంద్రబాబు వద్ద నరసరావుపేట పంచాయతీ

నరసరావుపేట నియోజక వర్గంలో ఇటీవల టీడీపీలో నెలకొన్న వివిధ పరిణామాల నేపథ్యంలో పలువురు నాయకులు వస్తున్నా మీకోసం పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడుడిని శుక్రవారం సాయంత్రం కలిశారు. శుక్రవారం కోడెలను వెంట బెట్టుకొని సింహాద్రి, సుబ్బారావు తదితర నాయకులు పెదకాకానిలో మధ్యాహ్న భోజన విరామానికి ఆగిన చంద్రబాబును కలిసి తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. నరసరావుపేటలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సస్పెన్షన్‌కు గురైన కొల్లి బ్రహ్మయ్య తీసుకొచ్చిన పాటల సీడీని చంద్రబాబు ఆవిష్కరించడంపై మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్ వర్గం నేతలు తీవ్రంగా ఆక్షేపించారు.

కొల్లి బ్రహ్మయ్య తాను పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు వర్గం అని చెప్పుకొంటూ నరసరావుపేటలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. అతన్ని పార్టీ జిల్లా కమిటీ సస్పెన్షన్ చేసిందన్నారు. అయినాసరే తాను ప్రత్తిపాటి వర్గం అని చెప్పుకొంటున్నా జిల్లా కమిటీ ఎందుకు ఖండించదని ప్రశ్నించారు. కోడెల వర్గీయుల ఆవేదనను ఆలకించిన చంద్రబాబు వాళ్లని పార్టీ సస్పెన్షన్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీతో వాళ్లకు సంబంధం లేదన్నారు. వాళ్లు మన పార్టీ కాదని భావించాలని చెప్పారు. మిమ్మల్ని కాదని వాళ్లను ప్రోత్సహించే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. నరసరావుపేట అంటే కోడెల, కోడెల అంటే నరసరావుపేట అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నియోజక వర్గంలో ఇంకొకరిని ప్రోత్సహించే ప్రశక్తే లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు.

తాను పాదయాత్రలో ఉన్నప్పుడు ఎవరు ఎదురొచ్చినా మాట్లాడటం జరుగుతుందని, అలానే సీడీలు, క్యాలెండర్లు ఆవిష్కరించడం సహజంగా జరిగిపోతుందన్నారు. అసలు ఆ కొల్లి బ్రహ్మయ్య ఎవరో కూడా తనకు తెలియదని వచ్చిన వారెవరో తనకు తెలియదని, వారు పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తులని తనకు సమాచారం లేదన్నారు. పార్టీతో వారికి సంబంధం లేదని, తాను చెప్పినట్టు ప్రకటించాలని నేతలకు సూచించారు.

చంద్రబాబును కలిసిన వారిలో పట్టణ పార్టీ అధ్యక్షుడు వేల్పుల సింహాద్రి యాదవ్, పార్టీ నేతలు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, వేములపల్లి వెంకట నరసయ్య, కొట్టా కిరణ్ కుమార్, రావెళ్ళ లక్ష్మీనారాయణ, మక్కెన ఆంజనేయులు, కొక్కిరాల శ్రీనివాసరావు, కడియాల రమేష్ తదితరులు వున్నారు. చంద్రబాబుతో జరిగిన చర్చల సారాంశాన్ని మీడియాకు వేల్పుల సింహాద్రి వివరించారు.