February 9, 2013

ఏమరుపాటుగా ఉంటే అమ్మేస్తారు: చంద్రబాబు

'ఎన్నికలు జరిగే ఒక్క రోజు నాకివ్వండి. ఆ తర్వాత ఐదేళ్ల పాటు సేవకుడిలా మీ బాగోగులు చూసుకొంటా. మీ కష్టాలు తీర్చి మీ ముఖంలో వెలుగు చూడాలన్నదే నా ఆకాంక్ష. మీకు రూపాయి ఇవ్వని వాళ్లు రూ. లక్ష కోట్లు దోచి పెట్టారు. ఆ డబ్బు మీ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడాలన్నదే నా తపనంతా అని' తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పాదయాత్ర మూడో రోజున పొన్నూరు నియోజకవర్గంలో ఆయన పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు...

ఏ ప్రభుత్వమైనా ఖర్చు తగ్గించుకొని ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని, టీడీపీ హయాంలో అదే చేశామన్నారు. సీసీ రోడ్లు, ఎన్‌హెచ్-5, సెల్‌ఫోన్లు, పాఠశాల భవనాలు, ఆసుపత్రులు అన్ని తన హయాంలో అభివృద్ధి చెందాయని చెప్పారు. పేదలు కూడా గ్యాస్‌పై వంట చేసుకోవాలని 35 లక్షల సిలిండర్లు తలుపు తట్టి ఇప్పించామన్నారు. కాంగ్రెస్, వైసీపీ దొందూదొందేనని ఏమాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా పెదకాకానిని అమ్మేస్తారని హెచ్చరించారు.

విద్యా ప్రమాణాలు పడిపోయాయి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకొని విచ్చలవిడిగా ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు ఇవ్వడం వలన విద్యా ప్రమాణాలు పూర్తిగా పతనమయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. 'నా హయాంలో చదువుకొన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయి. విదేశాలు, చెన్నై, బెంగుళూరు వంటి నగరాల్లో ఉద్యోగాలు సంపాదించారు. నేడు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని' చంద్రబాబు అన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి పేద పిల్లలు ఎంతవరకు చదువుకొంటే అంతవరకు ఉచితంగా చదివించే బాధ్యత తాను తీసుకొంటానన్నారు. చదువుకొన్న విద్యార్థులకు వెంటనే ఉద్యోగాలు రాకపోతే వారు తల్లిదండ్రులపై ఆధారపడకుండా నెలకు కొంత మొత్తం ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కాంగ్రెస్, వైసీపీలను బంగాళాఖాతంలో పడేయాలి ర్రాష్టాన్ని కుక్కల చింపిన విస్తరిలా చేసి ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్, వైసీపీలను బంగాళాఖాతంలో పడేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు అన్నారు. ఎవరైనా తమ పిల్లలు దొంగతనాలు, హత్యలు చేయకూడదని, తిరుగుబోతులు కాకూడదని కోరుకొంటారని, అలాంటిది కొంతమంది దొంగలు సిగ్గు లేకుండా నేరుగా చంచలగూడ జైలుకెళ్లి వైసీపీలో చేరుతున్నారని చెప్పారు. అలాంటి వారికి ఓటేసి ఆదరిస్తారా అని ప్రశ్నించారు.

ప్రధాని, రాష్ట్రపతిని ఎంపిక చేసిన ఘనత మాదే తెలుగుదేశం పార్టీ దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిని ఎంపిక చేసిన ఘన చరిత్ర కలిగినదని చంద్రబాబు చెప్పారు. అంబేద్కర్, ఎన్‌టీఆర్‌లు మాత్రమే దళితులకు న్యాయం చేశారన్నారు. నాడు మందకృష్ణ పోరాటం చేస్తే కమీషన్ వేసి మాదిగలకు ఎనిమిది శాతం రిజర్వేషన్ అమలు చేసి 24,500 ఉద్యోగాలు కల్పించానని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇదే అమలు జరిగి ఉంటే నేడు 60 వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవని, అలాంటిది సుప్రీం కోర్టులో కేసు వాదనకు మంచి న్యాయవాదిని పెట్టకపోవడం వలన వర్గీకరణ రద్దు అయి మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు. మాదిగల జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వారికి ఉద్యోగాలు ఇస్తానన్నారు.

అవినీతిని అంతం చేస్తే ఏదైనా సాధ్యమే అవినీతిని అంతం చేయగలిగితే ఏ హామినైనా ఆచరణలోకి పెట్టి చూపవచ్చని చంద్రబాబు అన్నారు. పేదవాళ్లకు దక్కాల్సిన డబ్బులను కాంగ్రెస్ దొంగలు దోచుకొని రాక్షస పాలన కొనసాగించారని చెప్పారు. ఆ దోపిడీ భారం ప్రజలపై పడిందన్నారు. బాగు పడాల్సిన సమయంలో తిరిగి కష్టాలు వచ్చాయన్నారు. ఇంట్లో నీళ్ల రసంతో భోజనం చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.