February 9, 2013

జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారు


అనిల్‌కు భక్తి లేదు, అన్ని దొంగ ప్రార్థనలే
సీఎం కిరణ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు : చంద్రబాబు

గుంటూరు, ఫిబ్రవరి 9 : తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌కు చెందిన నేతలు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జలయజ్ఞానికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే, రూ.30 వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ తేల్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

శనివారం ఉదయం జిల్లాలోని పెదకాకాని మండలం భరత్‌సింగ్ సర్కిల్ నుంచి 131వ రోజు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. ఆంజనేయకాలనీలో మిర్చి కల్లాలకు వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాబు మాట్లాడుతూ ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా కాల్వలు తవ్వారని ఆరోపించారు. 23 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా, 22 వేల ఎకరాలకు కూడా నీరు అందలేదని బాబు ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో సన్న బియ్యం కిలో రూ.15 ఉంటే, ఇప్పుడు కిలో రూ.50 కి పెరిగిందని చంద్రబాబు అన్నారు. మంత్రి అనుచరులు తప్పుడు పత్రాలతో భూములను కబ్జా చేస్తున్నారని, కబ్జాదారులపై తిరగబడాలని, ప్రజలకు అండగా ఉంటామని బాబు హామీ ఇచ్చారు.

దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు అనిల్‌కు భక్తి లేద ని, అన్ని దొంగ ప్రార్థనలే అని చంద్రబాబు ఆరోపించారు. అవినీతి సొమ్ముతో లోటస్‌పాండ్‌లో 70 గదుల ఇళ్లు కట్టారని, కుటుంబ సభ్యులు అంతా రెండు గదుల్లో ఉంటే, మిగిలిన రూముల్లో దయ్యాలు తిరుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, ఆయన తమ్ముళ్లు డబ్బులు వసూలు చేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో మరో 15 మంది మంత్రులు కూడా ఉన్నారని, వారిని సీఎం కాపాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతకుముందు చంద్రబాబునాయుడితో గుంటూరు జిల్లా పార్టీ నేతలు ఈ ఉదయం కలుసుకున్నారు. డీసీసీబీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా చంద్రబాబునాయుడిని జూనియర్ డాక్టర్లు కలుసుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.