January 14, 2013

జగన్ అవినీతిపై 'మొబైల్' వార్!



స్సెమ్మెస్‌లో శక్తిమంతమైన సాధనాలు
ఒక్కొక్కరికి పది చొప్పున పంపించండి
వివేకానందుడి స్పూర్తితో ఉద్యమించండి
యువతకు టీడీపీ అధినేత పిలుపు
కాంగ్రెస్, వైసీపీలు ఒక్కటే
వాటి సిద్ధాంతం దోచుకోవడం

 వైసీపీ నేత జగన్ అవినీతిపై మొబైల్ వార్ చేయాలని యువతకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక్కొక్కరికి పది ఎస్సెమ్మెస్‌లు పంపాలని పిలుపునిచ్చారు. వివేకానందుడి స్ఫూర్తితో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద శనివారం పాదయాత్ర ప్రారంభించారు. వరంగల్ క్రాస్ రోడ్డు, పెద్దతండా, జలగంనగర్, నాయుడుపేట, నయాబజార్ కళాశాల, మయూరిసెంటర్, బస్‌డిపో, రాపర్తినగర్, బైపాస్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు 15.4 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలో జరిగిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

"ఈ తొమ్మిదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రాక్షస పాలన సాగింది. అందుకే అన్నివర్గాల బతుకులు చితికిపోయాయి. రాష్ట్రం చీకటి రాజ్యమైంది. అవినీతి పెచ్చుమీరింది. కాంగ్రెస్ దొంగలు ర్రాష్టాన్ని దోచుకుని కోట్లు గడించారు.. ఈ పరిస్థితి పోవాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ మార్పు మీ చేతుల్లోనే ఉంది'' అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి ఖమ్మం పట్టణంలో నిర్వహించిన భారీ సభలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ను అంధకార రాష్ట్రంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. కరెంట్ ఇవ్వలేక ర్రాష్టాన్ని అంధకారంలో ఉంచారని, రాని కరెంట్‌కు బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికే ఆదర్శ ప్రదేశ్‌గా టీడీపీ పాలనలో చూపిస్తే.. హైదరాబాదును అవినీతికి రాజధానిగా మార్చిన ఘనత కాంగ్రెస్ పాలకులదన్నారు. కేంద్రం నుంచి ర్రాష్టానికి నిధులు తేవడంలోనూ ఈ కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, వైసీపీలు ఒకే తానులో ముక్కలన్నారు.

అభివృద్ధి అంటే నై.. అవినీతి అంటే సై అనడమే ఈ పార్టీల సిద్ధాంతమని దుయ్యబట్టారు. జగన్‌ను జైలులో కలుసుకుని ఆ పార్టీలో చేరుతున్నవారికి నీతిలేదని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో జగన్..ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు అమ్ముడు పోవడం లేదని, వారే పార్టీకి శక్తి అని ప్రశంసించారు. ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం మరువలేనని తెలిపారు.

ఈ సమయంలో సభలో కొంతమంది యువకులు మొబైల్‌లో మాట్లాడటం కనిపించింది. " తమ్ముళ్లూ.. అందరి దగ్గరా సెల్‌ఫోన్లుఉన్నాయి కదా. వాటితో కూడా మీరు అవినీతిపై పోరాటం చేయొచ్చు. జగన్‌కు వ్యతిరేకంగా ఒక్కొక్కరికి పది ఎస్సెమ్మెస్‌లు పెట్టండి'' అని సూచించారు. అంతకుముందు.. ఖమ్మం పట్టణంలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా బాబుకు బ్రహ్మర«థం పట్టారు.