January 14, 2013

అవినీతిపై యువత ఉద్యమించాలి



రాష్ట్రంలో అవినీతి వేర్లు బలంగా పాతుకుపోయాయని ఈ అవినీతిని అంతం చేసేందుకు యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకుని ఉద్యమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు.  జిల్లాలో నాలుగోరోజు పాదయాత్ర ఖమ్మం రూరల్ మండలంతోపాటు ఖమ్మం నగరంలో జరిగింది. జిల్లా కేంద్రంలో చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. చంద్రబాబు యాత్రకు వచ్చిన అపూర్వస్పందన టీడీపీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా, ఇల్లెందు క్రాస్‌రోడ్‌లలో ఎమ్మెల్యే తుమ్మల అధ్యక్షతన జరిగిన బహిరంగసభల్లో చంద్రబాబు ఉద్విగ్నంగా ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజాధనాన్ని కాంగ్రెస్ నేతలు అడవి పందుల్లా తింటున్నారని మండిపడ్డారు. ఈ అవినీతి దొంగలను తరిమికొట్టాలని, అవినీతికి సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని అన్నారు. కిరికిరి సీఎం కిరణ్‌కు పాలన గురించి ఏమీ తెలియదని విమర్శించారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రూ.32వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని తెలిపారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హమీ మేరకు రైతుల బ్యాంకుల రుణాలన్నీ మాఫీ చేస్తానని, మొదటి సంతకం ఆ ఫైలుపైనేనని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రస్‌లకు రైతు రుణమాఫీ అంటే గిట్టడం లేదని, అదెలా సాధ్యమంటూ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వారు దోచుకుని దాచుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకుంటే ఒక్క సారి కాదు.. ఐదుసార్లు రుణమాఫీ చేయొచ్చన్నారు. గ్రామాల్లో మంచినీళ్లు దొరకవు కానీ.. బెల్టుషాపుల పుణ్యమాని మద్యం మాత్రం 24 గంటలూ అందుబాటులో ఉంటోందని, అ«ధికారంలోకి రాగానే బెల్టు షాపులు రద్దు చేస్తామని తెలిపారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో కూడా అర్హత కల్పిస్తామని, ప్రతి ఏటా డీఎస్సీతోపాటు ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామనితెలిపారు.

ఖమ్మం నగరంలో జిల్లా కేంద్రాసుపత్రి అభివృద్ది, మున్నేరుకు కరకట్టల నిర్మాణం, మంచినీటి సౌకర్యం, పేదలకు ఇళ్లు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. బీసీ 33 ఉపకులాలకు రూ.10వేల కోట్లతో కులవృత్తుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. గిరిజన ఆడపిల్లల పెళ్లి కోసం రూ.యాభైవేలు ఇస్తామన్నారు. వంద సీట్లు బీసీలకు ఇస్తామని, బంజార, ఆదివాసీ పల్లెలను పంచాయతీలుగా మారుస్తామని బాబు హామీ ఇచ్చారు. అర్హులైన వారందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చెప్పారు. పత్తికి రూ.5వేల నుంచి 6వేల వరకు గిట్టుబాటు ధర ఇస్తామని , మిర్చిపంటకు కూడా గిట్టుబాటు ధర ప్రకటిస్తామని చెప్పారు. చదువుకున్న యువకులందరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని బాబు వెల్లడించారు.

వైఎస్సార్సీపీ, కాంగ్రెస్‌పార్టీలపై ధ్వజం: కాంగ్రెస్‌తోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై బాబు ధ్వజమెత్తారు.తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి తప్ప అబివృద్ధి లేదని రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత వారిదేనాన్నారు. పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని హెచ్చరించారు. కాంగ్రెస్ తల్లిపార్టీ అయితే.. వైఎస్సార్సీపీ పిల్లపార్టీ అని.. ఈ రెండు పార్టీల దోపిడీవల్లే రాష్ట్ర ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయన్నారు. తప్పు చేసి జైలుకు వెళ్లిన జగన్‌ను జైల్లోనే దర్శించుకుని పార్టీలో చేరుతున్నారు. ఇంతకన్నా నీతిమాలిన చర్య మరోటుంటుందా అనిప్రశ్నించారు. జగన్ లక్ష కోట్ల అవినీతిపైనా ప్రతి ఒక్కరు ఎస్ఎంఎస్‌ల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయాలని యువనతు కోరారు.

వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని అవినీతికి వ్యతిరేకంగా యువత ఉద్యమించాలని వంద మంది ఉక్కులాంటి యువకులు ఉంటే ప్రపంచాన్ని మార్చవచ్చని వివేకానందుడు చెప్పాడు.. అదే స్ఫూర్తితో యువత అవినీతిపై ఉద్యమించాలన్నారు. ఇటీవల ఢిల్లీ సంఘటన పట్ల యువతలో వచ్చిన చైతన్యం ప్రసంశనీయమని, అవినీతిపైనా ఇదే స్ఫూర్తితో పోరాడాలన్నారు.అక్రమకేసులు పెడితే ఖబడ్దార్:

రాష్ట్రంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలపైనా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అక్రమకేసులు పెట్టిస్తున్నారు. అలా అక్రమ కేసులు పెడితే ఖబడ్దార్ అని బాబు హెచ్చరించారు. పరిటాల సునీత కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టారు. ఆయన తండ్రి పరిటాల రవిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే హతమార్చింది. తప్పుడు కేసులు పెట్టడానికి సిగ్గు లేదా అని ఆవేశంగా ప్రశ్నించారు.