January 14, 2013

విద్యుత్ సంక్షోభం పాపం వైఎస్‌దే


ఆర్ఈసీకి గ్రహణం పట్టించాడు
ఆయన నిర్వాకంతోనే పరిశ్రమలు మూత

కరెంటు సరఫరా నెలలో 12 రోజులేనా?

ఖమ్మం పాదయాత్రలో చంద్రబాబు

ఖమ్మం గ్రానైట్ యజమానుల సమస్యలపై సానుకూలం

ప్రధానికి లేఖ రాస్తానని హామీ..

గ్రానైట్ హబ్‌గా తీర్చిదిద్దుతానని భరోసా

రాష్ట్రంలో రెగ్యులేటరీ కమిషన్‌ను భ్రష్టు పట్టించిన పాపం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వానిదేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వైఎస్ నిర్వాకం వల్లనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడి, పరిశ్రమలు మూతపడ్డాయని మండిపడ్డారు. ఖమ్మం పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వెంకటగిరి క్రాస్‌రోడ్డులో గ్రానైట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు.

గ్రానైట్ పరిశ్రమ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కృషిచేస్తానని యజమానులకు హామీ ఇచ్చారు. దీనిపై ప్రధానికి తక్షణమే లేఖ రాస్తానని భరోసా ఇచ్చారు. అయితే రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా గ్రానైట్ పరిశ్రమలు మూతపడుతున్నాయని, నెలలో 12 రోజులే విద్యుత్ సరఫరా జరుగుతోందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పలు ట్యాక్స్‌లు, విజిలెన్స్ దాడులతో మోయలేని భారం మోపుతోందని గ్రానైట్ అసోసియేషన్..చంద్రబాబుకు వివరించింది.

ఐదు హెక్టార్ల వరకు గ్రానైట్ క్వారీలకు అనుమతులు జిల్లాస్థాయిలోనే ఇప్పించాలని, పర్యావరణ అనుమతులు లేకుండా చూడాలని, చంద్రబాబుకు విన్నవించింది. ఇందుకు స్పందించిన చంద్రబాబు " ప్రతిపక్ష నేతగా గ్రానైట్ యజమాన్య సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా''నని ధైర్యం చెప్పారు. టీడీపీ హయాంలో పరిశ్రమలకు, ఇళ్లకు, వ్యాపారానికి, వ్యవసాయానికి విద్యుత్ సరఫరా తీరుపై రెగ్యులేటరీ కమిషన్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండేదన్నారు. ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన రూ.14వేలకోట్ల సొమ్ము చెల్లించకపోవడం, కమిషన్‌కు అర్హులైన వ్యక్తులను నియమించకపోవడం వల్ల అది భ్రష్టుపట్టిందన్నారు.

వైఎస్ తర్వాత వచ్చిన రోశయ్య పట్టించుకోలేదని, ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అసలు ఆ విషయమై అవగాహనే లేదని ఎద్దేవా చేశారు. " కిరణ్ సర్కార్ విధానాలు ఒకలా లేవు. ఓబులాపురం లాంటి గనుల లీజులు కేటాయింపులో తమకు కావాల్సిన వారికి అనుకూలంగా అధికారులను నియమించుకుని చకచకా అనుమతులు సాధించుకున్నారు. అదేసమయంలో గ్రానైట్ యజమానులకు క్వారీల కేటాయింపు విషయంలో ఏళ్లకు ఏళ్లు తిప్పుకుంటున్నారు'' అని మండిపడ్డారు.

టీడీపీ హయాంలో తాత్కాలిక అనుమతులతో క్వారీలకు అనుమతులిచ్చామని, సింగిల్ విండో విధానం తీసుకొచ్చి గ్రానైట్ పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించామని, నోడల్ అధికారితో పర్యవేక్షణ జరిపామని గుర్తుచేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు తమ విధానాలు చూసి గుజరాత్, బీహార్ ముఖ్యమంత్రులు అనుసరించారన్నారు. ఇప్పుడు ఆ ర్రాష్టాలు ముందున్నాయని, ఆంధ్ర వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే కృష్ణా, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు ఖమ్మంను గ్రానైట్ హబ్ చేస్తానని చెప్పుకొచ్చారు.

ఐదు హెక్టార్లకు పర్యావరణంతో పనిలేకుండా అనుమతుల విషయంలో కోర్టు ద్వారా పరిష్కారమయ్యేలా రివిజన్ పిటిషన్ వేయించేందుకు చొరవ తీసుకుంటానని హామీనిచ్చారు. అలాగే గ్రానైట్ యజమానులకు తక్కువ వడ్డీలకు బ్యాంకు రుణాలు ఇచ్చే విషయంలో పన్నులు తగ్గించే విషయంలో గ్రానైట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పక్కా ఇళ్లు, రేషన్‌కార్డులు, గ్యాస్ వారికి కావాల్సిన సౌకర్యాలకు కృషి చేస్తానన్నారు. గ్రానైట్ రంగ అభివృద్ధి కోసం టీడీపీ ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటిస్తుందని చంద్రబాబు హామీనిచ్చారు.

అదే సమయంలో అవినీతి విషయంలో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. "అవినీతి.. సమాజంలో ఫ్యాక్షన్ కంటే ప్రమాదకరమైంది. ఫ్యాక్షన్ వల్ల పదిమందో 20 మందో చనిపోతారు. అవినీతి వల్ల అన్ని వ్యవస్థలు దెబ్బతిని ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది'' అని చంద్రబాబు హితబోధ చేశారు. కాగా,ఖమ్మం పట్టణంలో బస చేసిన చంద్రబాబును వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు కలుసుకొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం వారితో జిల్లాల వారీగా ఆయన సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో పార్టీ శ్రేణుల పనితీరును ప్రశంసలతో ముంచెత్తారు. వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కార్యకర్తలను ఆదేశించారు. ప్రజల కోసం పనిచేసేందుకు రోజుకు 24 గంటలు చాలడం లేదని, కనీసం వంద గంటలైనా ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.