January 14, 2013

ధరల మంటలో బోగి పండగ!



ఈ రోజు నా యాత్ర జరిగిన ప్రాంతమంతా గ్రానైట్ క్వారీల పరిధిలోదే. గ్రానైట్ పరిశ్రమ ఒకప్పుడు సిరులు పండించేది. లక్షల మందికి ఉపాధి కల్పించేది. తెలుగువాళ్లే కాక రాజస్థాన్, గుజరాత్, బీహార్ నుంచి కూడా చాలామంది వచ్చేసి ఈ పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు. వెంకటగిరి సమీపంలో నాకు కొంతమంది గ్రానైట్ కార్మికులు, యజమా నులు ఎదురుపడ్డారు. పరిశ్రమ గతంలో మాదిరిగా నీడని ఇవ్వలేకపోతున్నదని కార్మికులు వాపోయారు. యాజమాన్యం పడుతున్న ఇబ్బందులవల్ల తమ ఉపాధికి భరోసా లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదంలో చనిపోయినా లేక వికలాంగులుగా మారినా ఆదరించే నాథుడే లేడని బాధపడ్డారు. ప్రభుత్వ విధానాలతో కుదేలవుతున్నామని యజమానులు మొర పెట్టుకు న్నారు. "విద్యుత్ సమస్యతో కోలుకోలేని దెబ్బతిన్నాం. అధికారికంగా నాలుగు గంటల కోత ఉండగా, అనధికారంగా మరో ఎనిమిది గంటలు కోత పెడుతున్నారు.

మరి మేం పరిశ్రమ ఎలా నడపగలం? పీక్ అవర్స్‌లో మామూలు కంటే 6 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. బ్యాంకు వడ్డీలూ చెల్లించలేకపోతున్నాం. యూనిట్‌కు నాలుగు రూపా యలు కాదు, అవసరమైతే తొమ్మిది రూపాయలు కడతామన్నా కరెంటు ఇవ్వలేని ఈ ప్ర భుత్వం ఎందుక''ని వారు ప్రశ్నించారు. మూడు లక్షలమందికి పైగా ఉపాధిని కల్పిస్తున్న ఈ పరిశ్రమపై ప్రభుత్వానికింత శీతకన్నా!

పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలను కలుసుకుంటున్న వాడిగా బోగి పండగను జరుపుకునేందుకు మనసు రావడంలేదు. రాత్రి ఒక క్రిస్టియన్ స్కూ ల్లో నేను బస చేశాను. నేను అక్కడ ఉన్నానని తెలిసి ఖమ్మం ఆడపడుచులు గుంపులుగా వచ్చారు. నేనున్న స్కూలు ఆవరణలో ముగ్గులు వేసి పండగ కళ తెచ్చారు. నాకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా, క్రిస్టియన్ స్కూల్లో సంక్రాంతి జరుపుకొని మత సామరస్యానికి వేదికగా మారినందుకు ఆనందంగా ఉంది.