January 14, 2013

మా కార్యకర్తలను, రైతులను తాకితే సహించం



చేతగాకపోతే దిగిపో!

నేనైతే ఆరు నెలల్లో కరెంటు సమస్య పరిష్కరిస్తా

కేసులు పెడితే ఖబడ్దార్
కిరణ్‌పై చంద్రబాబు నిప్పులు

పాదయాత్రలో భారీ మార్పులు

కృష్ణా నుంచి గుంటూరుకు మారిన షెడ్యూల్

"రాష్ట్రమంతా అంధకారంలో మగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించడం మీకు చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. నేనైతే ఆరు నెలల్లో పరిష్కరిస్తా'' అంటూ కిరణ్ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. విద్యుత్ సమస్యపై పోరాడుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, రైతులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి, ప్రభుత్వ సొమ్మును దోచుకున్న మంత్రులనేమో జైలుకు పంపకుండా రక్షిస్తావా అంటూ నేరుగా దుయ్యబట్టారు. "ఖబడ్దార్ కిరణ్‌కుమార్‌రెడ్డి.. నీవు బయటికి వెళ్లలేవు'' అంటూ హెచ్చరించారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. "నీకు విద్యుత్ సమస్య అర్థం కాదు. పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించడం తెలియదు. ట్రాన్స్‌మిషన్ లైన్లు ముందు జాగ్రత్తగా పెట్టుకోవు.. నీది చేతకాని, అవినీతి, అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం. నీకు కరెంటు ఇవ్వటం చేతకాక పోతే ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయి. విద్యుత్ ఎలా ఇవ్వాలో నేను చూపిస్తా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "రైతులు, నాయకులపై కేసులు పెడితే భయపడరు. విద్యుత్ సమస్యలపై పోరాడిన కరీంనగర్ ఎమ్మెల్యేలపై అక్రమంగా పీడీ యాక్టు కింద కేసులు పెట్టి జైలుకు పంపుతావా?.

గుంటూరు జిల్లాలో సహకార బోగస్ సభ్యత్వాల విషయంలో పోరాడిన మాజీ మంత్రి కోడెల శివ్రపసాద్‌ను అరెస్టు చేయిస్తావా? దివంగత నేత పరిటాల రవీంద్రకుమారుడు పరిటాల శ్రీరాంను సింగపూర్‌లో పరీక్షలకు వెళ్లనీయకుండా తప్పుడు కేసులు పెట్టించి అడ్డుకుంటావా?.. అలాంటి నువ్వు నీ మంత్రివర్గంలోని అవినీతి నేతలు జైళ్లకు వెళ్లకుండా కాపాడుతున్నావు..' అంటూ బాబు ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై కడుతున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తాము ఎలా పోరాడామో.. అక్కడి పోలీసులను ఎలా గడగడలాడించామో... కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.

తమ హయాంలో ఇలాగే అక్రమ కేసులు పెట్టించిఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగయ్యేదని గుర్తుచేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే దమ్మూధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. చీప్‌లిక్కర్‌పై పన్ను భారం వేసి పేదలను దోచుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ నేతలు కేసిఆర్, కేటిఆర్ తెలంగాణలో ఉద్యమం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, పాదయాత్రలో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి.

నల్లగొండ, గుంటూరు జిల్లాల పర్యటనను మళ్లీ ఆయన పాదయాత్ర మార్గంలో చేర్చారు. ఖమ్మం జిల్లా నుంచి నేరుగా కృష్ణా జిల్లాలోకి వెళ్ళేలా ఆయన యాత్రను కుదించాలని మొదట అనుకొన్నారు. కానీ ఆ రూటు పూర్తిగా గ్రామీణ మార్గంలో ఒక ఇరుకు రహదారిలో ఉంది. ఆయన ఆంధ్రలో అడుగు పెడుతున్న చోట స్వాగత కార్యక్రమం నిర్వహించాలనుకొంటున్నామని, ఈ ఇరుకు రహదారిలో అంత పెద్ద కార్యక్రమం కుదరనందువల్ల రూటు మార్చాలని కృష్ణా జిల్లా పార్టీ నేతలు కోరారు.

నట చంద్రుడు

మూడు నిమిషాల ఫిల్మ్‌కు ఫోజు
 లీడర్ చంద్రబాబు కాస్తా హీరో చంద్రబాబు అయ్యారు. ఆయనపై మూడు నిమిషాల వీడియో ఫిల్మ్‌ను చిత్రీకరించే అవకాశం బాలీవుడ్ దర్శకుడు మణిశంకర్‌కు దక్కింది. అయిదు హిందీ సినిమాలతో పాటు 1500యాడ్ ఫిల్మ్‌లను చేసిన మణిశంకర్ చంద్రబాబును డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఇటీవల నరేంద్రమోడీపై వీడియో ఫిల్మ్ తీసిన విషయం తెలిసిందే. అయితే జాతీయ స్థాయిలో ఆ చిత్రానికి ప్రచారం లభించటంతో అదే తరహాలో బాబుపై చిత్రీకరించారన్న ప్రచారం జరుగుతోంది.