January 14, 2013

ఐదేళ్లు మీ సేవకుడిగా ఉంటా..



 


'వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే ఓ ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజలకు ఓ సేవకుడిగా పనిచేస్తా. నాకు ఆస్తిపాస్తులపై ఆశ లేదు.. కష్టపడే తత్వం నాది''అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మూడో రోజు జిల్లాలో కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో బాబు పాదయాత్ర జరిగింది. శుక్రవారం ఉదయం 11.30కి కూసుమంచి
నుంచి బయలుదేరిన పాదయాత్రం కోక్యా తండా, నేలపట్ల, జీళ్ల చెరువు, గోపాలరావుపేట, తల్లంపాడు, పొన్నెకల్ క్రాస్‌రోడ్డు, మద్దులపల్లి, తెల్దారుపల్లి క్రాస్‌రోడ్ మీదుగా కోదాడ క్రాస్ రోడ్ వరకు చేరుకుంది. మూడో రోజు మొత్తం 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చంద్రబాబు ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కాంగ్రెస్ అవినీతి విధానాలను, వైఎస్ జగన్ అవినీతిని ఎండగట్టారు. కష్టించి పనిచేసే వ్యక్తిత్వం నాది, గాడి తప్పిన ఈ ర్రాష్టాన్ని మళ్లీ అభివృద్ధి పథం వైపు నడపాలన్నదే తన తపన అన్నారు. తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను చూసి బీహార్, గుజరాత్ ర్రాష్టాలు అభివృద్ధి సాధిస్తే కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని చంద్రబాబు ఆరోపించారు.

అధికారంలోకి రాగానే రైతు రుణ మాఫీ చేసి చూపిస్తా, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం ఆ ఫైల్‌పైనేనని ప్రకటించారు. రెండో సంతకంగా బెల్టుషాపులు రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మంచినీళ్లు లేవు కానీ బెల్టుషాపులున్నాయని, ప్రభుత్వం చీప్్ లిక్కర్‌పైనా పన్నుల భారం వేసి పేదలను దోచుకుంటుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇది రాక్షస ప్రభుత్వం, అందుకే మద్యం విచ్చలవిడిగా పారించి పేదల శ్రమను ఆదాయం చేసుకుంటుందని ఆరోపించారు. స్థానిక పరిపాలన దెబ్బతిందని, గ్రామాల్లో రోడ్లు, కాల్వలు మరమ్మతులు చేసే పరిస్థితి కూడా లేదని, రాష్ట్రప్రభుత్వమే గాడి తప్పింది, మళ్లీ గాడిలో పడాలంటే తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలని విజ్ఞప్తిచేశారు.

కాంగ్రెస్ 9 ఏళ్లపాలనలో వైఎస్ జగన్ లక్ష కోట్లకుపైగా సంపాదించాడు. అవినీతి సొమ్ముతో ఊరూరా విగ్రహాలు పెడుతున్నారని పేర్కొన్నారు. విద్యుత్తు సమస్యలపై పోరాడాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి.. జైలు పాలు చేస్తోందని మండిపడ్డారు. అయినా.. ఎవరూ భయపడొద్దు మీవెంట పోరాటానికి నేనున్నానని అన్నారు. ఈ ప్రభుత్వానికి ఉద్యమాలతోనే బుద్ధి చెబుతామని భరోసా ఇచ్చారు. మూడోరోజు పాదయాత్రలో చంద్రబాబు రైతులు, కూలీలు, గిరిజనులు మహిళా సమస్యలపై మాట్లాడారు. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చారు. పాదయాత్రలో మాజీ మంత్రి తుమ్మల, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర, ఊకే అబ్బయ్య, బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావు, స్వర్ణకుమారి, టీడీపీ నేతలు మందడపు సుధాకర్, ఇంటూరి పుల్లయ్య, గుత్తా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.