January 12, 2013

అలుపెరుగని పయనం..ఆర్ధరాత్రి శయనం

 
టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర శుక్రవారం ఉదయం 11.30కి మొదలై అర్ధరాత్రి తర్వాత ముగిసింది. కూసుమంచి ఖమ్మం రూరల్ మండలాల్లో పర్యటన సాగింది. తెల్లవారే నిద్రలేచిన బాబు యథావిధిగా కాల కృత్యాలు, యోగా అనంతరం స్నానం చేశారు. నల్గొండ, తదితర జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు రావడంతో కొద్ది సేపు ముచ్చటించారు. అనంతరం 9గంటలకు ముందుగా ఇచ్చిన అపాయింట్‌మెంట్ మేరకు షార్ట్‌ఫిల్మ్ షూటింగ్‌కు హాజరయ్యారు. ఫిల్మ్ షూటింగ్ ఉదయం 11గంటలకు ముగిసింది. పదకొండుగంటల నుంచి 11.30 వరకు మరలా ఇతర జిల్లాల నేతలతో మాట్లాడటం, వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బస నుంచి బయల్దేరి ప్రాంగణం లో తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం పాదయాత్రకు బయల్దేరారు.

కొద్ది సేపు అనంతరం కూసుమంచి సెంటర్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. తదుపరి క్షౌరశాలను, నాగన్న హోటల్‌ను సందర్శించారు. స్వాగతించిన ఎస్ వీ ఎస్ కళాశాల విద్యార్థులతో దారిలోకొద్ది సేపు ముచ్చటించారు. లోక్యా తండా క్రాస్ రోడ్ వద్ద పైలేరియా బాధితులు వచ్చి బాబును కలిసారు బోదకాలు ఆపరేషన్‌ను ఆరోగ్య శ్రీలో చేర్చటం తోపాటు పింఛన్లు కల్పించే విధంగా ప్రభుత్వంపై వత్తిడి తేవాలన్నారు.

కూలీలను పలుకరిస్తూ..

దారి పొడవునా బాబు పత్తి, మిరప కూలీలను పలకరిస్తూ వారి కష్ట నష్టాలు తెలుసుకుంటూ నడిచారు. దారిలో ఎదురైన మహిళా రైతులు తమ దీనగాథను బాబుకు వినిపించారు. నీలం తుపాను ధాటికి గురై పంటలు పూర్తిగా నాశనం కావటంతో కూలీలుగా మారామని వాపోయారు. వారి కష్టాన్ని విని చలించిన బాబు ఆదుకుంటాం అధైర్య పడవద్దని అభయ మిచ్చారు. ఆదిలక్ష్మి అనే యువతి ఎదురై బాలకార్మికురాలిగా ఉన్న తనను మీప్రభుత్వ హయాంలో బడిలో చేర్చటంతో ప్రస్తుతం డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నానని చెప్పటంతో బాబు సంతోషించారు. నాసిరకం విత్తనాలు, నకిలీపురుగు మందులు మార్కెట్లలో దళారుల దోపిడీ పై రైతులు కూలీలు బాబుకు ఫిర్యాదు చేసారు. అనంతరం మధ్యాహ్నాం 2 గంటలకు లోక్యా తండాలో ఎన్టీ ఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగించారు. మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు యాత్ర మళ్లీ మొదలయ్యింది. కోక్యా తండా, నేలపట్లలో ఎన్టీ ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. సభల్లో మాట్లాడారు. అగ్రహారం మీదుగా యాత్ర రాత్రి 8.30కి ఖమ్మం రహదారిపై ఉన్న జీళ్ల చెరువుకు చేరింది. అక్కడి నుంచి ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు , పొన్నేకల్ మీదుగా బాబు బస ప్రాంతం మద్దులపల్లి చేరింది.