January 12, 2013

కరువు సాయం కూడా తేలేని అసమర్థ ప్రభుత్వం



ఢిల్లీలో సొంత పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నా కనీసం కరువు సాయం కూడా తెచ్చుకోలేని అసమర్థ ప్రభుత్వంగా కిరణ్ సర్కారు తయారైందని టీడీపీ ధ్వజమెత్తింది. 'మహారాష్ట్ర, కర్ణాటకకు భారీగా కరువు సహాయమిచ్చిన కేంద్రం.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం పైసా విదల్చలేదు. తెలుగు ప్రజలు గెలిపించిన ఎంపీల సాయంతోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చింది.. నడుస్తోంది. కాని తెలుగువారికి మాత్రం కేంద్రం నుంచి సాయం రాదు. రాష్ట్ర ప్రభుత్వం కరువు సాయం కోసం నివేదికలు పంపకపోవడం వల్లే తాము నిధులు ఇవ్వలేదని కేంద్ర మంత్రులు బహిరంగంగా చెబుతున్నారు.

రాష్ట్రంలో ప్రజలను కరువు వేధిస్తుంటే ప్రభుత్వాన్ని ఆలోచనలు, ఆచరణ.. చివరకు నివేదికల కరువు వేధిస్తున్నట్లు కనిపిస్తోంది' అని ఆ పార్టీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిదేళ్లలో కేంద్రాన్ని రూ.15, 500 కోట్లు సాయం అడిగితే.. రూ.1540 కోట్లు మాత్రం వచ్చాయని చెప్పారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నపుడు ఇక్కడి ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఢిల్లీ నుంచి సోనియాగాంధీ సహా కాంగ్రెస్ నేతలంతా పరిగెత్తుకు వచ్చారంటూ ఇప్పుడు మాత్రం ఇటు తిరిగి చూడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. 'కరువు సాయం కోసం కేంద్రాన్ని అడగటంలోనే కాకుండా ఇక్కడ కరువు మండలాల ప్రకటనలో కూడా ప్రభుత్వ పనితీరు ఘోరంగా ఉంది.

మహబూబ్‌నగర్ జిల్లాలోని మొత్తం మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్ నివేదిక ఇస్తే కేవలం ఐదు మండలాలు మాత్రం ప్రకటించారు. ఇదే పరిస్ధితి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా ఉంది. కలెక్టర్లు పంపిన నివేదికలను కనీసం తెరిచి కూడా చూడలేదు. దమ్ముంటే కలెక్టర్ల నివేదికలను బహిర్గతం చేయాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది నెలకొన్న కరువు అనేక జిల్లాల్లో గ్రామీణ ప్రాంత ప్రజల నడుం విరగగొట్టిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ సహాయ కార్యక్రమాలు మొదలు పెట్టాలని జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు.