January 12, 2013

సీఎం కార్యాలయం ఎదుట టీడీపీ ధర్నా



విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్

విద్యుత్తు చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా టీడీపీ నాయకులు సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం (సీ బ్లాక్) వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు బైఠాయించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దకు తీసుకెళ్లి వదిలేశారు. విద్యుత్ సమస్యలపై ప్రభుత్వ కార్యదర్శి మిన్నీ మాథ్యూకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన టీడీపీ నేతలు.. ఆమె సీఎం కిరణ్ వెంట తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లడంతో సీఎం కార్యాలయం ఎదుటే ధర్నాకు దిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ వినియోగదారులపై రూ.30 వేల కోట్ల అదనపు భారం వేసిందంటూ వారు ధ్వజమెత్తారు. చార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించి, వ్యవసాయానికి 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, టీడీపీ ఎమ్మెల్యేలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేఎన్ రత్నం, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, పి.నరేందర్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.