January 12, 2013

పెద్దదిక్కు లేని ఇల్లులా పల్లెలు!



పురుగుమందు మనిషిని చంపినంతగా పురుగును చంపలేదు. కరెంటు రైతును కాటేసినంతగా కాంతిని పంచలేదు. రోడ్లు నరకద్వారాలే గానీ నడిచేందుకు పనికిరావు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం స్ఫూర్తి ఏ గ్రామంలోనూ నాకు కనిపించలేదు. ఈ రోజు ఎక్కువగా తండాలు, గూడేల మీదుగా సాగాను. ఎక్కడ చూసినా మురికికూపాలే.

డ్రైనేజీలు లేక మురుగంతా రోడ్లపై ప్రవహిస్తోంది. కరెంట్ వైర్లు చూస్తే భయపడే పరిస్థితి. కొన్నిచోట్ల చేతికి అందేంతగా తీగలు వేలాడుతున్నాయి. పట్టించుకునే నాథుడే లేడు. పారిశుద్ధ్యం లేదు. వీధిలైట్లు లేక అంధకారంలో ఉన్నాయి. నేను ఎక్కడకు వెళ్లినా కరెంటు గురించే అడుగుతున్నారు. "కరెంటు చాలాముఖ్యం. మీరు ఎలా చేస్తారో తెలియదు. కరంటు ఇప్పించమని'' కోరుతున్నారు. ఎంత కష్టం!

పాలేరు రిజర్వాయర్ ఉన్నా సమీప గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. గొంతెండే ఇలాంటి గ్రామాలనెన్నింటినో చూశాను. ఈ చలికాలంలో చిన్న చద్దరు కూడా లేని మనుషులను చూశాను. తల దాచుకోడానికి గూడూ లేదు. కొన్ని గ్రామాల అంతర్గత రహదారుల గురించి చెప్పాల్సిన పనిలేదు. బాగున్న దారి మచ్చుకు ఒక్కటీ కనిపించలేదు. ఇలా గ్రామాలన్నీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని ఎవరిని అడగాలో తెలియక ప్రజలు దిక్కుతోచకుండా ఉన్నారు.

పంచా యతీలకు ఎన్నికలు లేవు. సర్పంచ్‌లు లేరు. స్పెషల్ ఆఫీసర్లూ లేనట్టే. స్వపరిపాలన ఎండమావి. సొంత పాలకులు వేస్తున్న పాచికలకు పల్లెలు తెల్లబోతున్నాయి. పెద్దదిక్కు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఇప్పుడు పల్లెల పరిస్థితి అలా ఉంది. టీడీపీ హయాంలో గ్రామాలు అద్దంలా ఉండేవి. ఊరిలో ప్రతి వీ«ధికి చక్కని సిమెంట్ రోడ్లు ఉండేవి. గ్రామ గ్రామానికి మంచినీటి పథకాలు ఉండేవి. పచ్చదనం, పరిశుభ్రతలతో గ్రామాలు ఆదర్శవంతంగా ఉండేవి. ఆనాటి పాలనారీతిని ఈ తరానికి అందించాలనేదే నా ఆశయం.