January 12, 2013

అన్నగా .. అండగా ఉంటా..



జిల్లాలో చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాద యాత్రకు శుక్రవారం రాత్రి రూరల్ మండలం తల్లంపాడులో ప్రజలు లాంతర్లతో స్వాగతం పలికారు. విద్యుత్ కోతకు నిరసనగా ప్రజలు ఇలా వినూత్నంగా బాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబు ప్రసంగిస్తూ టీడీపీ పాలనలో వర్షాభావ పరిస్థిలు ఏర్పడి వరస కరువులు వచ్చినా తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.

అధికారంలో కొస్తే కుంటుంబంలో ఓ అన్నగా అన్ని విధాలుగా ఆదుకుంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ లక్షల కోట్ల ప్రజా ధనాన్ని రాజశేఖరరెడ్డి తన కుమారుడికి కట్టబెట్టారని విమర్శించారు. వైఎస్ క్యాబినెట్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా అవినీతి మకిల అంటినవారేని విమర్శించారు. బయ్యారంలో లక్షా కోట్ల విలువైన ఇనుపరాయిని తన అల్లుడికి రాసిచ్చాడని ఆరోపించారు. ఈ ప్రభుత్వ పెద్దలంతా ప్రజా ధనాన్ని పందికొక్కులా దోచుకుతింటున్నారిని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీ ఆవిర్భవించిందని తెలిపారు. బాబుకు లాంతర్లతో స్వాగతం పలికిన వారిలో టీడీపీ మండలాధ్యక్షులు బెల్లవేణు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మండల కార్యదర్శి ధరావత్ రామ్మూర్తి, తెలుగు యువత అ«ధ్యక్షుడు గూడా సంజీవరెడ్డి, కొప్పుల ఆంజనేయులు, పంతులు, మల్లాచారి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. చంద్రబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకులు స్వాగతం పలికారు.