January 14, 2013

టీడీపీకి అధికారం మీ సమస్యలన్నీ దూరం



 
'రాష్ట్రంలో సామాన్యులు పండుగనాడైనా కుటుంబసభ్యులతో అనందంగా గడపలేని పరిస్థితి.. అతిథులు వస్తే ఆదరించలేని దుస్థితి ఏర్పడింది. పెరిగిన నిత్యావసరాల ధరలు భారంగా మారాయి' అని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా ఆదివారం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి సభలో చంద్రబాబు మట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. 'పండుగలు, శుభకార్యాల సమయంలో కూడా భర్త మోటార్ దగ్గర, భార్య కుళాయి దగ్గర నీటి కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది' అని ఆవేదన వ్యక్తం చేశారు. డెంగ్యూ జ్వరం వస్తే ఆరోగ్యశ్రీ వర్తించటం లేదని ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లటంతో అప్పులు పాలయ్యామని ఓ బాధితురాలు తన గోడును బాబుకు విన్నవించింది.

తాను అధికార పగ్గాలు చేపడితే అన్ని వ్యాధులకు వైద్యం అందించేలా ప్రత్యేక హెల్త్ ప్లాన్ రూపొందిస్తామని ప్రకటించారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం మంజూరు చేసింది కానీ, భూములు మాత్రం అప్పగించలేదని, ఆ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయో కూడా తెలియదని ఓ ఎస్సీ రైతు ఆవేదన వ్యక్తం చేయగా.. తాము అధికారంలోకి రాగానే దళిత రైతుల అసైన్డ్ భూములకు పట్టాలిచ్చి లక్షాధికారులను చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయా వృత్తుల వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం గొర్రెల కాపరుల సమస్యలు విన్న చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే గొర్రెల కాపరులకు ఉచిత బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు.

వైఎస్ హయాంలో ఎస్సీ రైతుల భూములు పెద్దలకు కట్టబెట్టారని, ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ఎస్సీ రైతుల భూములను లాక్కుని పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ విషయంపై చంద్రబాబు మాట్లాడుతూ.. వైఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే మాదిగలకు అన్యాయం జరిగిందని, ఎస్సీ వర్గీకరణకు తాను పూర్తిగా సహకరించి 'చంద్రబాబు పెద్దమాదిగ' అనిపించుకుంటానన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయమై వైఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేయలేదని, దీంతో రాష్ట్రానికి సాగునీటిలో అన్యాయం జరిగిందన్నారు. ఈ సభలో వైఎస్ హయాంలో జరిగిన అవినీతిని, జగన్ అక్రమాలను, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను బాబు తూర్పారపట్టారు.