January 15, 2013

చంద్రబాబు పాదయాత్ర షెడ్యూల్



చంద్రబాబు పాదయాత్ర షెడ్యూల్ మారింది. ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యన ఏ రోజైనా బాబు యాత గుంటూరు జిల్లాలోకి ప్రవేశించ వచ్చని తెలుగుదేశం పార్టీ నాయకులు భావించగా షెడ్యూల్‌ను మార్పు చేస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ సమాచారం పంపింది.గుంటూరు జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఈ విషయాన్ని తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీన చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్ మీదుగా జిల్లాలోకి అడుగు పెట్టి మంగళగిరి నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని వెల్లడించారు. 12 రోజుల పాటు జరిగే పాదయాత్రలో భాగంగా జిల్లా కేంద్రంలోనే రెండు రోజుల సమయాన్ని కేటాయించామన్నారు. పూర్తిస్థాయిలో రూట్‌మ్యాప్ త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.

నాగార్జునసాగర్ కుడికాలువకు విడుదల చేస్తోన్న 6,500 క్యూసెక్కుల నీరు ఆరుతడి పంటలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. నీటిపారుదల రంగంపై అవగాహన లేని మంత్రి ఆ శాఖను నిర్వర్తిస్తుండటం వలనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉన్నా ఆరుతడి పంటలకు ఎందుకు నీరు ఇవ్వడంలో అర్థం కాకుండా ఉందన్నారు. ఆరుతడి పంటలకు మూడు తడులు ఇస్తామని హామీ ఇచ్చిన జిల్లా యంత్రాంగం కనీసం రెండో తడికే దిక్కు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా ఉండేందుకు తక్షణం కాలువలకు డిజైన్ చేసిన విధంగా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లాలోని ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఒక కేంద్ర మంత్రి వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి పరిమితమౌతున్నారే తప్ప ప్రజల అవసరాలను గాలి కొదిలేశారని విమర్శించారు. జిల్లా అంతటా కరువు విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వం మొక్కుబడిగా నాలుగు మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించిందని, ఈ మంత్రులు ఏమి చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. వర్షాభావ మండలాలన్నింటిని రెండో దశలోనైనా కరువు మండలాలుగా ప్రకటించి రైతులకు తక్షణ సాయం అందించాలని కోరారు. రూపాయికి సన్నబియ్యం అంటూ ముఖ్యమంత్రి గొప్పలు చెబుతున్నాడని, ఒకపక్క గ్యాస్‌ను రూ. వెయ్యి పెట్టి తీసుకొనేలా చేసిన ఆయనకు బీరాలు పోవడానికి సిగ్గు, శరం ఉండాలన్నారు.

విద్యుత్ సర్‌చార్జ్‌లతో కాంగ్రెస్ ప్రభుత్వం తుపానులా కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ఎలాగూ తిరిగి అధికారంలోకి రాలేమని గ్రహించిన సీఎం ఇష్టారాజ్యంగా ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, ఇతర నాయకులు ముత్తినేని రాజేష్, ఎలుకా వీరాంజనేయులు, కొర్రపాటి నాగేశ్వరరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, సుకవాసి శ్రీనివాసరావు, ముప్పాళ్ల మురళీ, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు.