January 15, 2013

బాబు పాదయాత్ర బెజవాడలో రెండు రోజులు!



 

'వస్తున్నా .. మీకోసం'లో భాగంగా ఈ నెల 21వ తేదీన కృష్ణా జిల్లాకు చంద్రబాబు పాదయాత్ర చేరుకుంటుంది. ఈ సందర్భంగా విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాలనూ చుట్టేలా రూట్ మ్యాప్ తయారు చేసే పనిలో అర్బన్ నాయకులు ఉన్నారు. ఖమ్మంలో వచ్చిన స్పందన చూసి చంద్రబాబు యాత్రను ప్రజలకు మరింత చేరువుగా తీసుకువెళ్ళాలన్న ఆలోచనలు స్థానిక నాయకులు ఉన్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు ఒక్కరోజు ఉండటమే గగనం అనుకుంటున్న తరుణంలో రెండు రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయానికి నాయకులు వచ్చారు. ఈ విషయాన్ని కంబంపాటి రామమోహనరావు పార్టీ వర్గాలకు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు రెండ విడతలుగా కృష్ణా జిల్లాలో పాదయాత్రను నిర్వహించటానికి వీలుగా కృష్ణా జిల్లా పార్టీ సన్నాహాలు చేస్తుంది. తొలి విడతలో జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం మీదుగా నగరంలోకి బాబు ప్రవేశిస్తారు.

ఈ సందర్భంలో కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ప్రకాశం బ్యారేజి మీదుగా పాదయాత్రను చేసుకుంటూ గుంటూరు జిల్లా వెళతారు. అంటే ఒక్క పశ్చిమ నియోజకవర్గంలో మాత్రమే కవర్ అవుతుందన్న మాట. రెండో విడత షెడ్యూల్ నగరంలోకి ప్రవేశిస్తుందా ? లేదా ? అన్నదానిపై ఇంకా నిర్ణయం చేయాల్సి ఉంది. ఈ సమయంలో అర్బన్ పార్టీ మొదటిసారగా బాబు వస్తున్న సందర్భంలో కొద్ది గంటలు పాదయాత్ర నిర్వహించే కంటే కూడా ఒక రోజంతా నగరంలోనే పాదయాత్ర సాగేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. అందుకు మూడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అర్బన్ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వంశీమోహన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని నగర ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలంటే మూడు నియోజకవర్గాలను కలుపుకుంటూ పాదయాత్ర జరగాలన్నది తమ అభిమతమని వంశీ చెప్పారు.

ఇంతలో చంద్రబాబు కూడా రెండు రోజుల పాటు అవకాశాన్ని చంద్రబాబు కల్పించటంతో అర్బన్ నాయకులు రూట్‌మ్యాప్‌ను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలన్న దానిపై సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ నుంచి సెంట్రల్‌కు తిరిగి అక్కడి నుంచి తూర్పుకు ప్రవేశించిన తర్వాత ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు చేరుకునేలా రూట్‌మ్యాప్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

విజయవాడలో బాబు పాదయాత్ర ఇలా..?నగరంలో బాబు పాదయాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్ ఇలా ఉన్నట్టు తెలుస్తుంది.

గొల్లపూడి నుంచి బాబు నగరంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి కుమ్మరి పాలెం, చిట్టినగర్, ఎర్రకట్ట మీదుగామధ్య నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. 22 వ డివిజన్‌లోని న్యూ రాజరాజేశ్వరిపేట, సింగ్‌నగర్, బుడమేరు వంతెన, ప్రభుత్వ ముద్ర ణాలయం మీదుగా సత్యనారాయణపురంలోకి ప్రవేశిస్తారు.అక్కడ నుంచి చుట్టుగుంట మీదుగా తూర్పు నియోజకవర్గంలోకి బాబు పాదయాత్ర చేరుకుటుంది.