July 4, 2013

విజయఢంకా మోగించాలి..........ఉద్యోగాలు రావాలంటే టీడీపీని గెలిపించాలి

టీడీపీ అధికారంలోకి వస్తే పింఛన్ల సొమ్ము పెంచుతాం
చంద్రబాబు పిలుపు

పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం విజయఢంకా మోగించాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడకు సమీపంలోని కంకిపాడు మండలం ఈడ్పుగల్లు గురువారం నిర్వహించిన పంచాయతీరాజ్‌ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ సదస్సుకు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తూ కాంగ్రెస్‌ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. అభివృద్ధి సం క్షేమ పథకాలు ఆగిపోయాయని ఆరోపించారు. పంచాయతీల బలోపేతానికి తెలుగుదేశం కృషి చేస్తుందన్నారు. మంచి సర్పంచ్‌లను ఎన్నుకుంటే గ్రామాలు బాగుపడతాయని అన్నారు. లేదం టే అభివృద్ధి జరగదన్నారు. వైఎస్సార్‌ హయంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అనిశ్చితి పెరిగిందన్నారు. అవినీతి పరులతో చంచల్‌గూడ జైలు నిండిందన్నారు. తెలుగుదేశం హయంలో పనిచేసిన ఐఏఎస్‌లు ఉన్నత స్థానంలో ఉంటే వైఎస్‌ హయంలో పనిచేసిన వారు జైలు పాలవుతున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటు వేయడం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని జగన్‌కు ప్రజలలో బలం ఉందని బెయిల్‌ ఇవ్వమని వత్తిడి తెచ్చే అవకాశం ఉందన్నారు. రాబోయే ఎన్నికలో నిజాయితీ పరులను, మంచివారిని ఎన్నుకోకపోతే శాశ్వతంగా బాధపడాల్సి వస్తుందన్నారు. తన హయంలో గ్రామాల అభివృద్ధికి శ్రమదానం, జన్మభూమి,పచ్చదనం పరిశుభ్రత,ప్రజల వద్దకు పాలన పెట్టానని తద్వారా గ్రామాలో ఎంతో అభివృద్ధి సాధించానని అన్నారు. గ్రామాలో మద్యం సిండికేట్‌లు,ఇసుక సిండికేట్‌లు, ఇసుక సిండికేట్‌లు పెరిగిపోయాయని అన్నారు. తెలుగుదేశం గెలవడం ఒక చారిత్రక అవసరం అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఫించన్లను రూ.200 నుంచి రూ 1000లకు పెంచుతామని, వికలాంగులకు రూ.500 నుంచి రూ.1500 వరకు పెంచుతామని అన్నారు. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా నీతి వంతమైన పాలన అందించామన్నారు. మీ పిల్లల కు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశంను గెలిపించాలని కోరారు. ఈ సదస్సులో బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు,ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కొమ్మాలపాటి శ్రీధర్‌, యరపతినేని శ్రీనివాసరావు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, టి.వి.రామారావు,కందుల నారాయణరెడ్డి,జయమంగళ వెంకట రమణ, ఎమ్మెల్సీలు నన్నపనేని రాజకుమారి, అంగర రామ్మోహనరావు,పార్టీ ప్రధాన కార్యదర్శులు వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గరికపాటి మోహనరావు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు సీతామహాలక్ష్మీ, ప్రకాశం జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్ధన్‌ తెలుగుదేశం నాయకులు డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు, కాగిత వెంకట్రావు, బొండా ఉమా,అంబికా కృష్ణ, మాగంటి బాబు, లాల్‌ జాన్‌ భాషా,పంచుమర్తి అనూరాధ,రావి వెంకటేశ్వరరావు, సిఎల్‌ వెంకట్రావు, నగర అద్యక్షులు నాగుల్‌ మీరా, బుద్దా వెంకన్న, గద్దె రామమోహనరావు, వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, నడికుదిటి నరసింహారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, వల్లభనేని వంశీ, దివి శివరాం, తెలుగుదేశం పార్టీ విజయవాడ లోక్‌సభ ఇన్‌ చార్జి కేశినేని శ్రీనివాస్‌నాని, కడియాల రాఘవరావు నాలుగు జిల్లాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభానికి ముందు మాజీ కేంద్ర మంత్రి కె.ఎర్రంనాయుడు, మాజీ ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య, మాజీ ఎమ్మెల్యే పి.వి.నరసింహరాజు మృతికి, ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు సదస్సు ప్రగాఢ సంతాపం తెలిపారు.