July 4, 2013

రేపు 'దేశం' ప్రాంతీయ సదస్సు

స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ఆ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శనివారం ఆరు జిల్లాల పార్టీ ప్రతినిధులతో జిల్లాలో ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సును పెద్దఎత్తున నిర్వహించేందుకు జిల్లాపార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఈ సదస్సులో రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పార్టీ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ప్రాంతీయ సదస్సు ద్వారా దిశా నిర్దేశం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. ఉదయం 10గంటలకు నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమం ముగిసే వరకు పార్టీ అధినేత చంద్రబాబు ఉంటారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎంపిక చేసిన ప్రతినిధులు మాత్రమే హాజరయ్యే ఈ శిబిరంలో శిక్షణ కూడా ఉంటుంది. ఈ సదస్సులో నియోజకవర్గ కోర్ కమిటీ, మండల కోర్ కమిటీ, గ్రామ కోర్ కమిటీ తదితర ప్రతినిధులు దీనికి హాజరవుతున్నారు. ఈ సదస్సులో స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పకబ్బందీగా వ్యవహరించాల్సిన తీరు, తదితర కీలకాంశాలపై ప్రతినిధులకు బోధించనున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, సమావేశం విజయవంతంపై గురువారం టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ నెల 5న నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయాలని చర్చించారు. సదస్సుకు నేరుగా పార్టీ అధినేత చంద్రబాబే హాజరు కానుండటంతో నేతలు కూడా సదస్సుకు అదే స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 50వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్టు అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి 20వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా భారీగా ఉండాలనే ఆలోచనతో ముందస్తుగా గురువారం పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చర్చించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని కొంపల్లిలోని ఎక్స్‌లెన్స్ గార్డెన్‌లో ఈ సదస్సును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ సమవేశంలో టీడీ పీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పి. మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కేఎస్ రత్నం, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌గౌడ్, నియోజకవర్గ కన్వీనర్లు, పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.