July 4, 2013

స్థానిక సంస్థలకు జవసత్వాలు : చంద్రబాబు

స్థానిక సంస్థలకు టీడీపీ హయాంలోనే అధికారాలు, నిధులు అందించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ నాశనం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. పంచాయతీల్లో కనీస సౌకర్యాలు కరువైపోతున్నాయని, తాగడానికి నీళ్లు దొరకడం లేదని, రాత్రి వీధిదీపాలు వెలగడం లేదని, గ్రామాల్లో పాఠశాలలు తెరుచుకోవడం లేదని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదని, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. వీటన్నింటికీ కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ఇటీవల కేంద్రం స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చిందని, మన వాటాగా రూ. 4వేల కోట్లు రావాల్సి ఉండగా.. పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ సొమ్ము రాకుండా పోయిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఇసుక ఆదాయంపై పంచాయతీలకే హక్కు కల్పించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చేసి గ్రామాల్లో 'ఇసుక మాఫియా'ను తయారుచేసిందన్నారు. ఆఖరుకు వృత్తిపన్ను, నీటితీరువా కూడా పంచాయతీలకు ఇవ్వడం లేదన్నారు.

ఎమ్మెల్యేల పెత్తనం అంగీకరించం
స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా ఎమ్మెల్యేలే పెత్తనం చేస్తున్నారని, దాన్ని తాము ఆమోదించబోమని చంద్రబాబు పేర్కొన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక పంచాయతీల వీధిదీపాల విద్యుత్తు వ్యయం భారీగా పెరిగిపోయిందన్నారు. గతంలో యూనిట్ ధర రూ. 2.30 ఉండగా దాన్ని రూ. 5.37 చేశారన్నారు. తాగునీటి పథకాలకు విద్యుత్తు యూనిట్ రేటు 1.40 ఉండగా దాన్ని రూ.4.37కు పెంచేశారని ఆరోపించారు. సాగు ఖర్చులు 300 శాతం పెరిగితే మద్దతు ధర 20 శాతం కూడా పెంచలేదన్నారు.