July 4, 2013

కాంగ్రెస్‌కు ఎన్నికలు అంటే భయం : చంద్రబాబు

 కాంగ్రెస్ పార్టీకి ఎన్నికంటే భయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం విశాఖలో జరిగిన ప్రాంతీయ సదస్సులో పాల్గొన్న ఆయన డప్పు కొట్టి స్థానిక ఎన్నికల నగారా మ్రోగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించలేదని అన్నారు. మునిసిపల్ ఎన్నికలు నిర్వహించేందుకకు మూడేళ్లు పట్టిందని, పంచాయతీ ఎన్నికలకు రెండున్నరేళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో అర్హులకు ఫించన్లు అందితే, కాంగ్రెస్ హయాంలో అనర్హులకు మంజూరు చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌ల అధికారాలను, విధులను ఇతరులకు బదిలీ చేసి పంచాయతీ సర్పంచ్‌లను ఉత్పవ విగ్రహాలుగా మార్చిందని ఆయన ఆరోపించారు. టీడీపీ సర్పంచ్‌లకు పూర్తి అధికారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం పేరుతో కాంగ్రెస్ నేతలు దోచుకున్నారని అన్నారు. తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో సదస్సుకు హాజరయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి టీడీపీ సమాయత్తం అవుతోంది. పార్టీ శ్రేణులను ఈ దిశగా సంసిద్ధం చేసే నిమిత్తం ఆ పార్టీ బుధవారం నుంచి ఐదు చోట్ల ప్రాంతీయ సదస్సులను నిర్వహిస్తోంది. మొదటి సదస్సు బుధవారం విశాఖ నగరంలో జరిగింది. నాలుగో తేదీన విజయవాడ, ఐదో తేదీన తిరుపతి, ఆరో తేదీన హైదరాబాద్, ఏడో తేదీన వరంగల్ నగరాల్లో జరగనున్నాయి. వీటన్నింటికి చంద్రబాబు హాజరవుతారు. ఒక్కో ప్రాంతీయ సదస్సుకు నాలుగైదు జిల్లాల పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్నా పార్టీ శ్రేణులకు ఈ ఎన్నికల ప్రాధాన్యాన్ని వివరించడం ద్వారా మంచి ఫలితాలు వచ్చేలా చూడాలన్నది టీడీపీ వ్యూహం.
ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపడంతోపాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ ప్రాంతీయ సదస్సులు పెడుతున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ అన్నారు. విశాఖ సదస్సుకు శ్రీకాకుళం, విజయనగరం,విశాఖ,తూ ర్పు గోదావరి జిల్లాల నుంచి ఇరవై వేల మంది ఈ సదస్సుకు హాజరయ్యారు.4న జరిగే సదస్సుకు విజయవాడలోనిఈడుపుగల్లు వేదికకానుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 20 వేల మంది కార్యకర్తలు పాల్గొంటారని అంచనా. 5వతేదీ తిరుపతిలో జరిగే సదస్సుకు చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూ రు జిల్లాల నుంచి 20 వేల మంది హజరు అవుతారు. వరంగల్‌లో ఈ నెల 7న జరిగే టీడీపీ ప్రాంతీయ సభ నిర్వహణకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 25 వేల మందికిపైగా పార్టీ ప్రతినిధులు హాజరవుతారని ఎర్రబెల్లి చెప్పారు.