July 4, 2013

స్థానికంగా విజృంభించండి : బాబు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు తముళ్లకు దిశానిర్దేశం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే 6 ప్రాంతీయ సదస్సులను బాబు ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు విశాఖలో జరిగిన మొదటి ప్రాంతీయ సదస్సులో ఆయన పార్టీ కార్యకర్తలకు పంచాయితీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వివరించారు. అంతేకాకుండా ఈ వేదిక నుండే అధికార కాంగ్రెస్ ను ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయితీ వ్యవస్థను భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించే దమ్ము కాంగ్రెస్ కు లేదని.. కాంగ్రెస్ పాలనలో… ఇలాంటివి ఎల్లప్పుడూ వుండేవేనని ఎద్దేవా చేశారు.

తెదేపా వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థానిక పాలనను ఏర్పాటు చేసినప్పటి నుంచి పంచాయితీల అభివృద్ధికి కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు. గ్రామ పంచాయితీ వ్యవస్థను ఒక క్రమపద్దతిలో అభివృద్ధి చేస్తూ.. గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు సర్పంచ్ లకు అవకాశం కల్పించామని బాబు పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ పరిపాలనలో.. కాంగ్రెస్ కార్యకర్తలే కమీషన్లతో గ్రామాల అభివృద్ధికి అడ్డుగోడలా తయారయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొందేందుకు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని బాబు కార్యకర్తలకు సూచించారు.తెలుగుతమ్ముళ్లు (కార్యకర్తలు) తెలుగుదేశానికి ఏకైక ఆస్తి అని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థుల విజయానికి వారే పాటుపడతారని చంద్రబాబు అన్నారు. ప్రాంతీయ సదస్సులలో అధినేత తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేస్తుండంతో.. ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాలను తెదేపా గెలుచుకుంటుందనే ఆశాభావాన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.