July 4, 2013

ఉత్సాహభరితంగా టిడిపి ప్రాంతీయ సదస్సు



2014 అధికారం లక్ష్యంగా పోరాడాలి
దేశం నేతలు పిలుపు

(విజయవాడ/కెఎన్‌ఎన్‌బ్యూరో) : స్థానిక సంస్ధల్లో విజయమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ గురువారం ఈడ్పుగల్లులో నిర్వహించిన ప్రాంతీయ సదస్సు ఉత్సాహవంతంగా జరిగింది. ఈ సదస్సుకు పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. నాలుగు జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుతో పాటు మచిలీపట్నం ఎంపి కొనకళ్లనారాయణరావు పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ లు హాజరయ్యారు. స్ధానిక సంస్ధలను బలోపేతం చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే వారి లో మంచివారిని ఎన్నుకోవాలని సూచించారు. కేవలం కులం, మతం, డబ్బు ప్రాతిపదికన కాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తులను ఎన్నుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ దిశగా కార్యకర్తలను, నాయకులను చైతన్యపరచాలని ఉద్భోధించారు. రాష్ట్రంలో సమర్ధత కలిగిన పరిపాలన రావాలంటే తెలుగుదేశం పార్టీనే గెలిపించాలని ఇందుకు పలు ఉదాహరణలతో కూడిన అంశాలను ఆయన కార్యకర్తలకు ఉదహరించారు. రాష్ట్రాన్ని చ క్కదిద్దాలంటే తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని చాటిచెప్పాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు అవసరమని ఆయన నొక్కి చెప్పారు. పంచాయతీ వ్యవస్ధ నిర్విరమైందని, పున: నిర్మించాల్సిన అవశ్యకత ఉందన్నారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని సమస్యలకు కారకులైన వారి గురించి ప్రజలకు వివరించాలని నిర్ధేశించారు. విద్యుత్‌ సంక్షోభం, ధరలపెరుగుదల ,వ్యవసాయం నీటి పారుదల రంగాలు, శాంతిభద్రతల వైఫల్యం, యువత నిరుద్యోగం, గ్రామాల్లో కొరవడిన మౌళికసదుపాయాలు, అవినీతి కుంభకోణాలు, అభివ ృద్ధికి ఆటంకం అంటూ పలు అంశాలపై ఆయన సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. పతనమైన వ్యవస్ధలను నిలబెట్టాలన్నా, అవినీతి రహిత సమాజం రావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగించాలంటే కార్యకర్తలు, నాయకులు ఇప్పటి నుం చే పనిచేయాలన్నారు. ఈ సదస్సుకు మహిళలు స్వల్ప సంఖ్యలో హాజరుకాగా, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నాలుగు జిల్లాల నుంచి భారీ వాహనాలతో కార్యకర్తలు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు పాల్గొన్నారు. అటు కొవ్వూరు, ఇటు గిద్దలూరు నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో చంద్రబాబునాయుడు వేదికపైకి చేరుకున్నారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి దివంగత నేతలు నందమూరి తారకరామారావు, కె ఎర్రంనాయుడు, పివి నరసింహరాజు, అంబటి బ్రాహ్మణయ్యలకు నివాళులు అర్పించారు. అనంతరం మా తెలుగుతల్లి గీతం తో సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులో చంద్రబాబు ఇటీవల ఉత్తరాఖండ్‌ వరదలపై తాను చేపట్టిన సహాయ కార్యక్రమాలను సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా బాధితులతో తాను పంచుకున్న అనుభవాలను వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. స్ధానిక ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాబోయే 2014 ఎన్నికల్లో అధికారాన్ని సాధించాలన్న లక్ష్యంగా పనిచేయాలని సదస్సులో ప్రసంగించిన వక్తలంతా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పై నాయకులంతా నిప్పులు చెరిగారు. ఒక దశలో మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌, విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధ, విజయమ్మ,షర్మిల, జగన్‌ ల పై చేసిన విమర్శలపై చంద్రబాబు సున్నితంగా మందలించారు. వ్యక్తిగత అంశాల జోలికి వెళ్ళరాదని రాజకీయంగానే ఎదుర్కోవాలని హితవు పలికారు. తన వ్యాఖ్యల పట్ల పంచుమర్తి అనురాధ విచారం వ్యక్తం చేశారు. కేవలం 48 గంటల వ్యవధిలో ప్రాంతీయ సదస్సును కృష్ణాజిల్లా నాయకులు విజయవంతంగా నిర్వహించారని ఏర్పాట్లు చురుకుగా చేశారని, సదస్సుకు హాజరైన ప్రకాశం, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లా నాయకులు ప్రశంసించారు. అంచనాలకు తగ్గట్టుగా 25వేలమంది హాజరుకాకపోయినా నాలుగు జిల్లాల నుంచి చెప్పుకోదగ్గ స్ధాయిలో కార్యకర్తలు తరలిరావడంతో నాయకుల్లో ఆనందం వెల్లివిలిసింది. కార్యకర్తలు కూడా చంద్రబాబు ప్రసంగాలకు జేజేలు పలుకుతూ ఉత్సాహపరిచారు.