April 16, 2013

కూటమి కడతాం.. పీఠం కొడతాం....రాష్ట్రంలోనూ మాదే అధికారం

ఎన్డీయే, యూపీఏ ఓటమి తథ్యం
ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నాం
'టైమ్స్ నౌ' చర్చలో చంద్రబాబు

హైదరాబాద్ : ఈసారి ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించనున్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. "అది మూడో ఫ్రంట్ కావొచ్చు. నాలుగో ఫ్రంట్ కావొచ్చు. ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మాత్రం ఎన్డీయే, యూపీఏ యేతర కూటమే'' అని స్పష్టం చేశారు. 'సీ వోటర్' సర్వేపై మంగళవారం రాత్రి 'టైమ్స్ నౌ' నిర్వహించిన చర్చలో చంద్రబాబు ఫోన్ ద్వారా పాల్గొన్నారు.

'గతంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో మీరు కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా అదే చేయనున్నారా? ఇతర పార్టీలతో టచ్‌లో ఉన్నారా?' అని ప్రశ్నించగా... 'ఔను! ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నాం' అని చంద్రబాబు తెలిపారు. "గతంలో మేం నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కూటములను సమర్థంగా నిర్వహించాం. అన్ని పార్టీలను కలిపి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో కూడా ప్రాంతీయ పార్టీలదే ప్రధాన పాత్ర అవుతుంది. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోనూ మాదే అధికారం'' అని చంద్రబాబు చెప్పారు.

జాతీయ స్థాయిలో 1996, 1998 నాటి పరిస్థితులు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. జగన్ పార్టీకి 26 నుంచి 30 సీట్లు వస్తాయని గత సర్వేలు చెప్పాయని... తన పాదయాత్రతో పరిస్థితులు మారిపోయాయని, ఇప్పుడు 12 సీట్లే వస్తున్నాయని సర్వేలో తేలిందని బాబు పేర్కొన్నారు. "2700 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. లక్షల మంది ప్రజలను కలిశాను. వారి సమస్యలను వింటున్నా'' అని చంద్రబాబు తెలిపారు. జాతీయ నాయకులకంటే ప్రాంతీయ పార్టీల నేతలే నయమని తెలిపారు.