April 16, 2013

చంద్రన్నకు జేజేలు

విశాఖపట్నం/నర్సీపట్నం/నాతవరం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో కొనసాగిస్తున్న 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రకు రెండో రోజైన సోమవారం విశేష ప్రజాదరణ లభించింది. కాళ్ల నొప్పి కారణంగా శని, ఆదివారాల్లో విశ్రాంతి తీసుకుని సోమవారం సాయంత్రం నడక ప్రారంభించిన చంద్రబాబు నాతవరం మండలం శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్‌ల మీదుగా డి.ఎర్రవరం చేరుకుని రాత్రి బస చేశారు. మార్గమధ్యంలో మహిళలు హారతులుపట్టి తిలకం దిద్దారు. పలువురు మహిళలు బాబుకు పాదాభివందనం చేశారు.

ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువుపెట్టారు. పెద్దలు, పిల్లలు, రైతన్నలు చంద్రబాబును చూసి ఆయనచెప్పేది వినేందుకు ఆసక్తి చూపారు. ఆరు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించిన బాబు శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్లలో జరిగిన సభల్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే పథకాల గురించి వివరించారు.

సీఎంపై విమర్శల దూకుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం అవినీతిమయం అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతున్న టీడీపీ అధినేత సోమవారం నేరుగా ముఖ్యమంత్రి, మంత్రులపై ఆరోపణలు చేయడమే కాకుండా ఎవరు నిజాయితీపరులో ప్రజల్లో తేల్చుకుందాం! రండి అంటూ సవాల్ విసిరారు. కాలునొప్పి, కండరాలనొప్పి తీవ్రంగా వున్నప్పటికీ ఆయన సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. ఆరోగ్యం సహకరించకపోయినా కాలునొప్పి తీవ్రంగా ఉన్నా మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వాహనంపై నిలబడలేక కుర్చీపై కూర్చొని మాట్లాడుతూ పాదయాత్రను కొనసాగించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలకోరంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ విషయంలో వాస్తవాలను పక్కనపెట్టి ప్రజలను ముఖ్యమంత్రి తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతిపరులుగా మారారని, ప్రభుత్వ ఉద్యోగాలను సైతం అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వైఎస్‌ను తొలిదశలోనే సోనియాగాంధీ, జగన్‌ను చిన్నప్పుడే అతని తల్లి విజయమ్మ మందలించి జాగ్రత్తపడివుంటే నేడు రాష్ట్రం అధోగతిపాలుఅయ్యేది కాదని అన్నారు. తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిపై బహిరంగచర్చకు సిద్ధంకావాలని ముఖ్యమంత్రికి సవాల్ చేశారు. తన పాదయాత్రను విమర్శిస్తున్న సీఎం, కాంగ్రెస్ నాయకులు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి గ్రామాల్లో సమస్యలు లేవని నిరూపించాలని, సమస్యలు లేవని ప్రజలు చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ చంద్రబాబు సవాల్ చేశారు.

కాగా శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్‌ల మీదుగా డి.ఎర్రవ
రం జంక్షన్‌కు చేరుకున్న చంద్రబాబు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వృద్ధులు, రైతులు, మహిళలు, చేతివృత్తులు, కులవృత్తుల వారు, డ్వాక్రా సంఘాల మహిళలు తమ సమస్యలు చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని, మీ సమస్యలన్నింటినీ తీరుస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాత్రి పదిన్నర గంటల సమయంలో డి.ఎర్రవరం చేరుకున్న ఆయన జిల్లాలో రెండోరోజు పాదయాత్రను ముగించారు.

అంతకు ముందు ఆయన తూర్పుగోదావరి జిల్లా తుని, అనపర్తి, విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజవకర్గాల నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.