April 16, 2013

విశాఖలో వేదిక ఏర్పాటు పర్యవేక్షణకు 'బుద్దా'కు పిలుపు

(విజయవాడ) చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ వేదిక ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బుద్దా వెంకన్నకు సీనియర్ నాయకులు అప్పగించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మేరకు పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు పాదయాత్ర ఇన్‌చార్జి గరికపాటి మోహనరావులు ఆదివారం మధ్యాహ్నం ఫోన్‌చేసి చెప్పారని బుద్దా వెంకన్న తెలిపారు. విజయవాడలో ఫ్లై ఓవర్ ఉద్యమాలకు వినూత్న వేదికలు ఏర్పాటు చేసిన దానిని దృష్టిలో పెట్టుకునే విశాఖలో నిర్వహించే బహిరంగ సభ వేదిక ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారన్నారు.

పది రోజుల ముందుగా విశాఖపట్నం వచ్చి వేదిక ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించాలని, చంద్రబాబే ఈ బాధ్యతలను అప్పగించిమని చెప్పినట్టు వారు తనకు చెప్పారని బుద్దా వెంకన్న అన్నారు. 20న చంద్రబాబు జన్మదినం కావడంతో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, 21న విశాఖ వచ్చి బహిరంగ సభ ముగిసేదాక ఉండి పర్యవేక్షిస్తానని యనమలతో చెప్పినట్టు తెలిపారు. పార్టీ అప్పగించిన వేదిక ఏర్పాట్ల బాధ్యతను దగ్గరుండి పర్యవేక్షిస్తానని బుద్దా వెంకన్న 'ఆంధ్రజ్యోతి'కి చెప్పారు.