April 16, 2013

సీఎం పర్యటనలతో ఒరిగిందేమీ లేదు

ఉట్నూర్: గ్రామీణ ప్రాంతాల ప్రజలు మంచినీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటనతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్ ఆరోపించారు. సోమవా రం స్థానిక ఎంపీ నివాసంలో ఉట్నూర్ మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పవార్ భీంరావు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన సందర్భంగా ఆయనను శాలువ కప్పి ఆహ్వానించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల మంచిర్యాల పర్యటన నిర్వహించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఈ నెల 26న నిర్మల్ పర్యటనకు వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న వ్యక్తి ప్రజల మనిషిగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు.

మంచిర్యాలలో వేదికపై ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై దురుసుగా మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రవర్తన ఆక్షేపనీయమన్నారు. అవినీతి ఊబిలో కూరుకపోయి నేరారోపణలు ఎదుర్కొంటున్న క్యాబినెట్‌లోని మంత్రులను కాపాడుకోనే చర్యలకు సీఎం పూనుకోవడం సరైంది కాదన్నారు. జిల్లాకు కేటాయించిన నిధులలో 90 శాతం నిధులు ఖర్చు కాక మురిగిపోతున్నాయని ఆరోపించారు. అటవీ శాఖ అధికారులు అభివృద్ది కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారన్నారు.

విద్యుత్ చార్జీలు తగ్గించాలని పేర్కొంటూ ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని ఇందులో భాగంగా మూడు వేల సంతకాలు సేకరించామని, సంతకాల సేకరణ ముగిసిన వెంటనే గవర్నర్‌ను కలిసి ప్రజల తరపున నివేదిస్తామని తెలిపారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల పథకం కోసం విడుదలైన నిధులు జిల్లా అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని అవసరం లేకుండానే నాసిరకం పనిముట్లు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై విజిలెన్స్ విచారణకు డిమాండ్ చేశామన్నారు. అదే మాదిరి జిల్లాలోని గ్రామ పంచాయతీలలో పారిశుధ్య సిబ్బంది లేకున్న చెత్తా సైకిల్‌లను కొనుగోలు చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈ విషయంలో కూడ విచారణకు డిమాం డ్ చేస్తున్నామని తెలిపారు.