April 16, 2013

సంక్షేమం ఏ డ్రైనేజీలోకి!

ములగపూడి చిన్న గ్రామం. వంద గడప కూడా లేని ఊరు. కుగ్రామాలకు ఉండే సమస్యలే ఇక్కడా ఉన్నాయి. రహదారి లేదు.. నీళ్లు రావు.. ఊరు పడకేస్తే మందేసే దిక్కు కరువు.. ఉన్న ఒక్కగానొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుబిళ్ల దొరకదు. ఇవేవీ నన్ను కదిలించలేదు గానీ, ఈ కుగ్రామంలో రెండు బెల్టుషాపులు ఉండటమే ఎక్కువగా ఆశ్చర్యపరిచింది. ఊళ్లో ఉన్న బెల్టుషాపుకు వెళ్లి మొగుడు పూటుగా తాగి వస్తుంటే..ఆ ఇంటి ఆడపడుచు మాత్రం ఖాళీ బిందె పట్టుకొని ఊరు దాటిపోవాల్సి వస్తున్నది.

ఈ విషయాలు చెప్పుకొని ఆ ఇల్లాళ్లు ఘోల్ల్లుమన్నారు. చిన్న వాటర్ ట్యాంక్ కట్టించాలని ఎంత మొత్తుకున్నా పట్టించుకోని పాలకులు.. ప్రజలను మత్తులో ముంచేందుకు మాత్రం ఒకటికి రెండు బెల్టుషాపులు తెచ్చి పెట్టారట. మందుబిళ్లకు దిక్కులేని చోట మందు ఏరులై పారుతున్నదట. ప్రజలను ఇంతలా సంక్షోభంలోకి నెట్టేసి..సర్కారు సంక్షేమం ఏ డ్రైనేజీలో మునకలు వేస్తున్నట్టు! తల దగ్గరే తాండవ నది పారుతోంది.

గడ్డపై నిలబడితే కనిపించే దూరంలో పరవళ్లు తొక్కుతోంది. గడపలో కడవ పెడితే అది నిండి పొంగి పొర్లాల్సిందే! కానీ, బెన్నవరం ఇప్పటికీ నీటి బెంగతో అల్లాడుతోంది. గుక్కెడు నీళ్ల కోసం గుక్కపెట్టడం స్వయంగా చూశాను. పర్యవేక్షణ కరువై ఉన్న ఒక్క మంచినీటి పథకమూ మూలన పడిపోయింది. నిజంగా..ఈ గిరిజన గ్రామాలది ఎంత దురదృష్ణం. విలువైన ఖనిజాన్ని తరలిం చుకుపోతున్నా చూస్తుండాల్సిందే. గొంతు తడపాల్సిన నదీ జలాలు ఊరు దాటిపోతుంటే నోరు తెరిచి.."ఇది అన్యాయం'' అని నినదించడానికి లేదు. నోరు లేని వీళ్లకు గొంతును కావడానికే నేనొచ్చా!