April 11, 2013

తప్పుడు దారిలో పోను! రాజకీయాల్లో లేకపోయినా ఫర్వాలేదు

కానీ తల్లి, పిల్ల కాంగ్రెస్ దొంగల్లా ప్రవర్తించను
అక్రమార్కులతో జత కలిస్తే చరిత్ర హీనుడినే
మేము ప్రజల్లోకి.. ఆ పార్టీలు కాంగ్రెస్‌లోకి..
'తెనాలి' ఘటన బాధేసింది
రౌడీ సర్కారులో ఆడపిల్లకు రక్షణ లేదు
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ఆవేదన
ప్రజల్లోనే నేడు ఉగాది వేడుకలు

కాకినాడ, గాజువాక : "రాజకీయాలలో లేకపోయినా ఫర్వాలేదు. కానీ, తప్పుడు మార్గంలో మాత్రం వెళ్లబోను. ఎప్పటికీ టీడీపీ ప్రజా సంక్షేమానికే కట్టుబడి ఉంటుంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కుమ్మరలోవలో బుధవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కొలిమేరు, సుభద్రమ్మ జంక్షన్, గాంధీ నగర్, ఎన్. సూరవరం మీదుగా నడక సాగించారు. దారిలో పిల్లలు, యువకులతో ఉత్సాహంగా మాట్లాడారు.

"ప్రభుత్వంపై జగన్ పార్టీ అవిశ్వాసం పెట్టినప్పుడు మీరూ సపోర్టు చేయవచ్చు కదా?'' అని కొలిమేరులో వెంకటేశ్ అనే యువకుడు ప్రశ్నించగా..అలాంటి అక్రమార్కులతో జతక డితే చరిత్రహీనులవుతామని వివరించారు. "రాజకీయాలలో నిజాయితీగా బతికాను. రాజకీయాల నుంచి వైదొలిగినా ఫర్వాలేదు. కానీ, తల్లి, పిల్ల కాంగ్రెస్ దొంగల్లా తప్పుడు పనులు చేయడానికి అంగీకరించను'' అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక బీహార్, గుజరాత్‌లకు పోవాల్సి వస్తున్నదని ఓ సీఏ విద్యార్థి ఆయన దృష్టికి తెచ్చారు.

టీడీపీ పాలనలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చేవారని గుర్తుచేశారు. "ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం, ఐటీలపై చాలామంది అసూయపడ్డారు. చాలా రాష్ట్రాల నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడకు వచ్చేవారు. ఇప్పుడు కాంగ్రెస్ దొంగల వల్ల పరిస్థితి తారుమారైంది''అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వంగతోట, మిరపతోటల్లోకి వెళ్లి రైతుల సమస్యలు విన్నారు. కొలిమేరులో టీడీపీ హయాంలో నిర్మించిన ఇంకుడుగుంతలను ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం కొలిమేర, ఎన్ సూరవరంల్లో జరిగిన సభల్లో చంద్రబాబు మాట్లాడారు.

రిజర్వేషన్లు పెడతామని కాపులను కాంగ్రెస్ మోసగించిందని ఆరోపించారు. కాంగ్రెస్ రౌడీ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో 'తెనాలి' ఘటన గుర్తు చేసుకొని బాధపడ్డారు. కాంగ్రెస్ ఊరూరా ఓ దొంగను పెట్టుకుందని, పేదలకు చెందాల్సిన ఇళ్లు వాళ్లు దొంగ బిల్లులతో కాజేస్తున్నారని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ పేరుతో లేని రోగం చెప్పి వేలకు వేలు గుంజుతున్నారని విమర్శించారు. రైతులు సంసారం చేయకుండా వ్యవసాయ పంపు సెట్లకు అర్ధరాత్రి కరెంటు ఇస్తున్నారని, అదీ గంట, రెండు గంటలే ఇస్తున్నారని ఎన్ సూరవరంలో ఆరోపించారు.

కాగా, ఎన్ సూరవరంలో చంద్రబాబు ఉగాది పండుగ జరుపుకోనున్నారు. టీడీపీ చరిత్రలో ఒక పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర కార్యాలయంలోకాక.. ఇలా ప్రజల మధ్య ఉగాది ఉత్సవాలు జరుపుకోనుండటం ఇదే తొలిసారి. ప్రముఖ పండితులు ప్రభల సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణాన్ని ఆయన ఆలకిస్తారు. కాగా, పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా వడ్లపూడి ప్రాంతంలో పైలాన్ ఏర్పాటుకు ఆ పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్ర గాజువాక ప్రాంతంతో ముగుస్తుండడంతో అక్కడికి సమీపంలోని వడ్లపూడి పెట్రోల్ బంక్ పక్కన పైలాన్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. గురువారం ఉదయం 8:40 గంటలకు పైలాన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్టు స్థానిక టీడీపీ నాయకులు చెప్పారు.