April 11, 2013

ప్రజాకంటకంగా మారిన ప్రభుత్వం : శోభాహైమావతి

పటాన్‌చెరు: ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకంటకంగా మారిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమావతి ఆరోపించారు. పెంచిన విద్యుత్‌చార్జీలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలుగుమహిళ ఆధ్వర్యంలో బుధవారం పటాన్‌చెరులో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్‌చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి గత ఎన్నికల్లో ప్రజల వద్ద ఓట్లు పొంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన వా
గ్ధానాన్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు.

విద్యుత్ అవసరాలపై ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడటానికి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెట్టుబడిదారులకు ప్రతిపక్షాలు కొమ్ముకాస్తున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దారుణమని మండిపడ్డారు. రెండువందల యూనిట్లకు పైబడి చిరు వ్యాపారులు విద్యుత్ ఉపయోగించుకుంటున్నారని... వారిని కూడా పెట్టుబడిదారులుగా గుర్తించడం ముఖ్యమంత్రికే చెల్లిందని శోభాహైమావతి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం చిన్న పరిశ్రమలు మూతపడి లక్షలాది మందికార్మికులు వీధిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందుకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదానికి ప్రజలను బలిచేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. మానవత్వాన్ని మరిచి ప్రభుత్వం విద్యుత్‌చార్జీలు పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆగ్రహ జ్వాలలో ప్రభుత్వం మాడి మసైపోవడం ఖాయమన్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పటాన్‌చెరు కార్పొరేటర్ సపానాదేవ్ మాట్లాడుతూ, విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌కు ఇక నూకలు చెల్లినట్టేనని హెచ్చరించారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు జి.శశికళాయాదవరెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ చార్జీలు పేద, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. వారు కరెంటు బిల్లులను తలచుకుని ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ఏ వస్తువు ధర పెంచలేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని శశికళాయాదవ్‌రెడ్డి డిమాండ్ చేశారు.

విద్యుత్ చార్జీలను తగ్గించేవరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, బక్కి వెంకటయ్య, దశరథరెడ్డి, మానిక్‌ప్రభు, సంజీవరెడ్డి, గంగుల సుధాకర్‌రెడ్డి, మెట్టు కుమార్‌యాదవ్, జీఆర్ఎల్ శ్రీనివాస్, ఎడ్ల రమేష్, ఎండీ యూనుస్, విశ్వనాథం, చంద్రకుమార్, జహంగీర్, మేరాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.