April 11, 2013

చిరుద్యోగులకు ఒక నీతి.. మంత్రులకు ఒక నీతా!

24 గంటల్లో రాజీనామా చేయకపోతే..
సీఎం ఇల్లు ముట్టడిస్తాం
కళంకిత మంత్రులపై టీడీపీ హెచ్చరిక
ఇంత సిగ్గులేని ప్రభుత్వం దేశంలో మరొకటి లేదు

హైదరాబాద్ : హోం మంత్రి సబితారెడ్డి పేరును నిందితురాలిగా సీబీఐ తన చార్జిషీట్లో చేర్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అల్టిమేటం జారీచేసింది. 24 గంటల్లోగా కళంకిత మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించడమో లేదా రాజీనామా చేయించడమో చేయని పక్షంలో సీఎం ఇల్లు ముట్టడిస్తామని ఆ పార్టీ హెచ్చరించింది. గురువారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో ఆ పార్టీ నేతలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావులపాటి సీతారామారావు విలేకరులతో మాట్లాడారు.

కోట్ల రూపాయల కుంభకోణాల్లో సీబీఐ దర్యాప్తులో నిందితులుగా తేలిన మంత్రులు దర్జాగా తిరుగుతున్నారని ముద్దు వ్యాఖ్యానించారు. 'చిరుద్యోగులు వంద రూపాయల లంచం తీసుకొంటే వారిని వెంటనే అరెస్టు చేసి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు. మంత్రులకు ఆ చట్టం వర్తించదా? హోం మంత్రిపై 420 సెక్షన్ కింద కేసు నమోదు చేయడాన్ని బట్టి చూస్తే తమ పదవులను ఎంత దుర్వినియోగం చేశారో అర్థమవుతోంది. జగన్ పత్రిక సీఈవో సోదరుడి కంపెనీకి మూడు నెలల్లో గని లీజు బదిలీ చేయాలని నిబంధన పెట్టి జీవో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అందుకే సీబీఐ కేసు పెట్టింది.

జగన్ లక్ష కోట్లు తింటే వీళ్లు పదుల కోట్లు తిన్నారు. అందుకే ఇలాంటి జీవోలు ఇచ్చారు. ఆ ఫైలును తిప్పి పంపి ఉంటే ఈరోజు నిర్దోషులుగా ఉండేవారు.' అన్నారు. సూరీడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావును తక్షణం అరెస్టు చేయాలని ముద్దుకృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. కేవీపీ ద్వారా సోనియాకు కూడా వాటాలు ముట్టడం వల్లే ఆమె కేవీపీ విషయంలో పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

మిస్టర్ క్లీన్ అని చెప్పుకొనే రాహుల్‌గాంధీ.. రాష్ట్రంలో అవినీతిపై ఎందుకు మాట్లాడటంలేదని ముద్దు ప్రశ్నించారు.ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఒక పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గుజరాత్ హోం మంత్రి పాత్ర ఉందన్న ఆరోపణలు రాగానే ఆ మంత్రిని అక్కడ పదవి నుంచి పీకి పారేశారని, ఇక్కడ ఆ మాత్రం జ్ఞానం లేదా అని పోలీస్ శాఖ మాజీ అధికారి రావులపాటి సీతారామారావు ప్రశ్నించారు.

'నిందితుడి వాదననే పరిగణనలోకి తీసుకొంటే దేశంలో ఏ ఒక్కరినీ దర్యాప్తు సంస్థలు అరెస్టుచేయలేవు. చట్టాలు ఉల్లంఘించారని ఒకసారి దర్యాప్తు సంస్థ నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తి ఎంత ఉన్నత పదవిలో ఉన్నా అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. హోం మంత్రిని వదిలిపెడితే రేపు ఇతరులను పోలీసులు ఎలా అరెస్టు చేయగలరు? ఈ ప్రభుత్వానికి ఏం నైతికత ఉంటుంది?' అని ఆయన అన్నారు.

సీబీఐ చార్జిషీటు దాఖలు చేయగానే సంబంధిత మంత్రి రాజీనామాను ముఖ్యమంత్రి కోరి ఉండాల్సిందని, కానీ ఆయనే అడ్డుపడటం దారుణమని రావులపాటి వ్యాఖ్యానించారు. ఈ కేసు ముఖ్యమంత్రి సొంత ఆస్తులకు సంబంధించింది కాదని, ప్రజల ఆస్తులపై దర్యాప్తు జరిగి నిందితుల నిర్ధారణ జరిగిన తర్వాత వారిని వెనకేసుకు రావడం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు చేయకూడని పనని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు.